న్యూఢిల్లీ: నాణ్యమైన క్రికెటర్ల కోసం బెంగపడాల్సిన అవసరం భారత క్రికెట్ జట్టుకు లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశాడు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు నైపుణ్యమున్న క్రికెటర్లతో కళకళలాడుతోందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగిందన్న ఎంఎస్‌కే.. ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్ అత్యుత్తమంగా ఉండటమేనని వెల్లడించాడు.
‘దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు చూడటమంటే నాకు చాలా ఇష్టం. సాధ్యమైనంత వరకూ ఎక్కువ దేశవాళీ మ్యాచ్‌లు చూడటానికి ప్రాధాన్యతనిస్తా. భారత్ క్రికెట్ భవిష్యత్ అంతా అక్కడే ఉంది. ప్రతి ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వస్తున్నారు. అందుకే దేశవాళీ మ్యాచ్‌లకు అధిక ప్రాముఖ్యతనిస్తాను’ అని ఎంఎస్‌కే పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో స్థానం కోసం పోటీ పెరగడం చాలా ఆనందంగా ఉందని, రిజర్వ్ బెంచ్ బలం చూస్తుంటే, మరో దశాబ్దం పాటు భారత జట్టుకి ఆటగాళ్ల విషయంలో ఎటువంటి బెంగ ఉండదన్నాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎదిగి పట్టుకోవడంలో భారత-ఎ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందన్నాడు. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో రాటుదేలిన వారేనని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment