ఆసియా కప్ ప్రారంభానికి ముందు అందరి దృష్టి భారత్–పాక్ పోరాటం గురించే. కొంతలో కొంత బంగ్లాదేశ్ గురించో, శ్రీలంక గురించో చర్చించుకున్నారు తప్ప అఫ్గానిస్తాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద జట్లతో తలపడుతూ 50 ఓవర్ల పాటు నిలవగలిగే సత్తా ఉందా అనే అనుమానాలూ వ్యక్తమమయ్యాయి. కానీ, ఇప్పుడు చూస్తే ఆసియా కప్‌లో భారత్ తర్వాత మెరుగైన జట్టుగా అఫ్గానే కనిపించింది.
సాక్షి క్రీడా విభాగం : ఇంతకాలం ఒకరిద్దరు ఆటగాళ్ల మెరుపులతో, అది కూడా టి20ల్లోనే సంచలన జట్టుగా పేరు తెచ్చుకున్న అఫ్గానిస్తాన్... తాజా ఆసియా కప్ ప్రదర్శనతో వన్డేల్లోనూ తమను ఇంకెంత మాత్రం తీసిపారేయలేరని చాటింది. ఓవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ గెలుపు కోసం ఆపసోపాలు పడుతుంటే, అఫ్గాన్ మాత్రం స్థిరమైన ఆటతో ఆకట్టుకుంది. భయం లేని ఆటతో లీగ్ దశను అలవోకగా ముగించి ఔరా అనిపించింది. సూపర్–4 లోనూ దీటుగానే ఆడినా, ఫినిషింగ్ లోపంతో ఫైనల్ గడప తొక్కలేకపోయింది. అయినప్పటికీ భారత్‌తో ఆఖరి మ్యాచ్‌లో పట్టు విడవకుండా ఆడి ‘టై’గా ముగించింది. ఓ విధంగా ఆ జట్టు స్థాయికిది విజయం కిందే లెక్క. కీలక సమయంలో కొంత అదృష్టం తోడై... ఒత్తిడిని ఎదుర్కొనగలిగి ఉంటే అఫ్గాన్ తొలిసారి ఆసియా కప్ తుది పోరుకు చేరి ఉండేది.
ఆకట్టుకుంది...
భారత్ సంగతి వదిలేస్తే ఆసియా కప్‌లో శ్రీలంక ముందే జారిపోయింది. బంగ్లాదేశ్ పడుతూ లేస్తోంది. పాకిస్తాన్ ఎప్పటిలాగే అనిశ్చితితో కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్ మాత్రం అన్నింటా ఆకట్టుకుంది. ప్రారంభం నుంచే అన్ని మ్యాచ్‌ల్లోనూ నిర్ణీత ఓవర్లు ఆడటంతో పాటు సగటున 250 స్కోరు చేసింది. లీగ్ దశలో పరుగుల పరంగానూ (లంకపై 91, బంగ్లాపై 136) భారీ తేడాతో గెలి చింది. టాపార్డర్‌లో షెహజాద్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీతో పాటు లోయరార్డర్‌లో రషీద్ ఖాన్, నైబ్ సత్తా చూపారు. బంగ్లాదేశ్‌పై 8వ వికెట్‌కు రషీద్–నైబ్‌ల 95 పరుగుల భాగస్వామ్యం అఫ్గాన్ బ్యాటింగ్ లోతెంతో చాటింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంగళవారం భారత్‌పై షెహజాద్ విధ్వంసక శతకం సాధించిన తీరు ముచ్చట గొలిపింది. వైవిధ్యమైన స్పిన్ కారణంగా అఫ్గాన్‌ను అంతా బౌలింగ్ బలం ఉన్న జట్టుగానే పరిగణిస్తున్నారు. కానీ, ఆ జట్టులోని ఆటగాళ్లు మేటి బ్యాట్స్‌మెన్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడటంతో వారి మానసిక స్థైర్యంతో పాటు బ్యాటింగ్ సామర్థ్యమూ మెరుగైంది. ఇందులో ముఖ్య పాత్ర కోచ్ ఫిల్ సిమ్మన్స్‌దే. బౌలింగ్‌లో పటిష్ఠంగా ఉన్నా, బ్యాటింగ్‌లో మెరుగు పడాల్సిన అవసరాన్ని సిమ్మన్స్ గుర్తించాడు.
పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఎలాగో అతడు బ్యాట్స్‌మెన్‌కు నేర్పాడు. దాని ఫలితమే... ఆసియా కప్‌లో కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సహా షెన్వారీ, నైబ్, రహ్మత్ షా, షాహిదిల ఇన్నింగ్స్‌లు. టోర్నీలో వీరంతా కనీసం ఒక అర్ధ శతకం సాధించడం విశేషం. అడపాదడపా విజయాలు సాధించినా, పెద్ద జట్లు పాల్గొనే టోర్నీల్లో అఫ్గానిస్తాన్ ఎలా ఆడుతుందో అనే దానిపై ఇప్పటి వరకు అనుమానాలుండేవి. ఆసియా కప్‌తో వాటికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా వన్డేల్లో మరో బలమైన జట్టు తయారవుతోందని తేలింది. అయితే, ఈ క్రమంలో అఫ్గాన్‌కు కావాల్సింది నిలకడ, అనుభవం. ఒత్తిడిని తట్టుకుంటూ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపైనా మెరుగైన ఆట కనబర్చాల్సి ఉంది. ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు కాకుండా... ఆసాంతం సాధికారికంగా సాగే బ్యాటింగ్ కావాలి. ఇప్పటికి 250కి అటుఇటుగా పరుగులు చేయడమే ఆ జట్టుకు పెద్ద స్కోరవుతుంది. మరింత ముందుకెళ్లాలంటే కనీసం 300కు దగ్గరగా అయినా రావాలి. అప్పుడే, విదేశాల్లోనూ విజయాలు సాధ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment