పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 13) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హష్మతుల్లా షాహిదీ ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో షాహిదీకి డిప్యూటీగా రహమత్ షా వ్యవహరించనున్నాడు. మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ గాయం కారణంగా గతేడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.
మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్.. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సెడిఖుల్లా అటల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కాదని ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు. 50 ఓవర్ల ఫార్మాట్‌కు కావాల్సినంత ఫిట్‌నెస్ లేకపోడంతో ముజీబ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ముజీబ్‌ను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కావాలని అతని డాక్టర్లు సలహా ఇచ్చారట. ముజీబ్ 2023 వన్డే వరల్డ్‌కప్ చివరిసారి ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డే ఆడాడు.
2023 వరల్డ్ కప్ ఆడిన జట్టులోని 10 మంది సభ్యులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికయ్యారు. ముజీబ్, నవీన్ ఉల్ హక్, రియాజ్ హసన్, అబ్దుల్ రెహ్మాన్, నజీబుల్లా జద్రాన్ లాంటి సీనియర్లకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు గత రెండు ఐసీసీ టోర్నీలో అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆఫ్ఘన్లు సంచలన విజయాలు నమోదు చేశారు. వీటిలో పాటు ఆఫ్ఘన్లు గతేడాది వన్డేల్లో సౌతాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించారు. అదే ఊపుతో ఆఫ్ఘన్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సంచలనాలు సృష్టించాలని ఆశిస్తున్నారు.
మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్ట జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 21న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు సౌతాఫ్రికాను ఢీకొంటారు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ దశలో ఇంగ్లండ్ (ఫిబ్రవరి 26న లాహోర్‌లో), ఆస్ట్రేలియాతో (ఫిబ్రవరి 28న లాహోర్‌లో) తలపడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..
హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహమత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, ఎఎమ్ గజన్‌హర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
రిజర్వ్ ఆటగాళ్లు: దార్విష్ రసూలీ, నంగ్యాల్ ఖరోటి, బిలాల్ సమీ
Comments
Please login to add a commentAdd a comment