శ్రీలంక యువ ఓపెనర్ పథుమ్ నిస్సంక అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క మ్యాచ్ గ్యాప్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) చరిత్ర సృష్టించిన నిస్సంక.. ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న మూడో వన్డేలో మరో సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
నిస్సంక రోజుల వ్యవధిలో డబుల్ సెంచరీ, సెంచరీ చేయడంతో లంక క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోతున్నాయి. సనత్ జయసూర్య తర్వాత ఇన్నాళ్లకు తమకు ఆ స్థాయి ఓపెనర్ దొరికాడని వారు సంబురపడిపోతున్నారు. నిస్సంక, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, మధుశంక లాంటి క్రికెటర్లు శ్రీలంక క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక విజయపు అంచుల్లో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (54), రహ్మత్ షా (65), రహ్మనుల్లా గుర్బాజ్ (48), ఇక్రమ్ (32) రాణించడంతో 48.2 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో మధుషన్ 3, అషిత ఫెర్నాండో, దునిత్ వెల్లలగే, అఖిల ధనంజయ తలో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మెరుపు వేగంతో విజయం దిశగా సాగుతుంది. నిస్సంక (117 నాటౌట్), ఆవిష్క ఫెర్నాండో (91) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 31 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 20 పరుగులు మాత్రమే కావాలి. నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (36) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక ఇదివరకే సిరీస్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment