పల్లెకెలె: ఓపెనర్ పతున్ నిసాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 42 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. నిసాంక ప్రత్యర్థి బౌలింగ్‌పై కడదాకా విధ్వంసం కొనసాగించాడు.
88 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ ఓపెనర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో తర్వాతి 100 పరుగుల్ని కేవలం 48 బంతుల్లోనే సాధించడంతో 136 బంతుల్లో అతని డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో లంక టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (189) ప్రేక్షకుడిగా హాజరైన ఈ మ్యాచ్‌లోనే నిసాంక అతని రికార్డును అతని కళ్లముందే బద్దలు కొట్టడం విశేషం.
అవిష్క ఫెర్నాండో (88 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన నిసాంక... సమరవిక్రమ (45; 4 ఫోర్లు, 1 సిక్స్)తో మూడో వికెట్‌కు 120 పరుగులు జత చేశాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పోరాడి ఓడింది.
27/4 స్కోరు వద్ద కష్టాల్లో పడిన జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (130 బంతుల్లో 136; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్‌కు 242 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది.
12 ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య. ఇందులో సగానికి (7)పైగా బాదింది భారత బ్యాటర్లే! ఒక్క రోహిత్ శర్మే మూడు ద్విశతకాలను సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) కూడా వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు.
3 నిసాంకది వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ (138 బంతుల్లో). ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో), ఇషాన్ కిషన్ (131 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment