దుబాయ్: ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసినప్పుడు లేదా మ్యాచ్‌లో విజయం సాధించిన సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆనందం పట్టలేక నాగిని డ్యాన్స్ చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా నాగిని డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఆ సిరీస్ ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయాక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని లంక, భారత్ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. అయితే, తాజాగా మరోసారి బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
శుక్రవారం ఆసియాకప్ ఫైనల్లో భారత ఓపెనర్ ధావన్ క్యాచ్‌ను సౌమ్య సర్కార్ అందుకున్న అనంతరం బౌలర్ నజ్ముల్ ఇస్లామ్ నాగిని డ్యాన్స్ చేశాడు. భారత్ తొలి వికెట్‌ను తొందరగా తీశామన్న ఆనందంలో నజ్ముల్లా నాగిని డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో స్టేడియంలో బంగ్లా అభిమానులు సైతం నాగిని డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌కు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బుమ్రా, చాహల్‌లకు తలో వికెట్ లభించింది. ఆ తర్వాత భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. చివరిబంతి వరకూ పోరాడిన భారత్ ఎట్టకేలకు గెలిచి ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment