జడేజా ‘సూపర్‌’  4 | India Won By 7 Wickets Over Bangladesh | Sakshi
Sakshi News home page

జడేజా ‘సూపర్‌’  4

Published Sat, Sep 22 2018 12:02 AM | Last Updated on Sat, Sep 22 2018 9:01 AM

India Won By 7 Wickets Over Bangladesh - Sakshi

ఆసియా కప్‌లో టీమిండియాకు మరో ఏకపక్ష విజయం. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌ తరహాలోనే ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సాగిన సూపర్‌–4 పోరులో బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆపై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యం చేరింది. పునరాగమనంలో జడేజా స్పిన్‌ మాయాజాలానికి భువీ, బుమ్రా అండగా నిలవగా... బ్యాటింగ్‌లో తనకు అలవాటైన రీతిలో రోహిత్‌ శర్మ అర్ధసెంచరీతో మ్యాచ్‌ను ముగించాడు. ఇక ఆదివారం మళ్లీ పాత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుకు భారత్‌ ‘సై’ అంటోంది.   

దుబాయ్‌: భారీ విజయంతో భారత్‌ సూపర్‌–4 దశను మొదలు పెట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్‌ మిరాజ్‌ (50 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా (4/29) చెలరేగగా, భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. బంగ్లా ఏకంగా 190 డాట్‌ బంతులు (31.4 ఓవర్లు) ఆడిందంటే భారత బౌలింగ్‌ ఎంత కట్టుదిట్టంగా సాగిందో అర్థమవుతుంది. అనంతరం భారత్‌ 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీతో మెరవగా, శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (37 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించారు. శనివారం విశ్రాంతి దినం తర్వాత రేపు జరిగే తర్వాతి పోరులో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడుతుంది.  

పేసర్ల జోరు... 
భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి జట్టుకు శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో లిటన్‌ దాస్‌ (7)ను భువీ ఔట్‌ చేయడంతో బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. మరో నాలుగు బంతులకే నజ్ముల్‌ (7)ను బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత బంగ్లా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా జడేజా దెబ్బకు జట్టు కుప్పకూలింది. 23 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 65/5 స్కోరుతో బంగ్లా కష్టాల్లో ఉన్న సమయంలో మహ్ముదుల్లా (51 బంతుల్లో 25; 3 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకునే ప్రయత్నం చేసినా అదీ ఎక్కువ సేపు సాగలేదు. మొసద్దిక్‌ (12)తో కలిసి 36 పరుగులు జోడించిన తర్వాత మహ్ముదుల్లాను భువీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించినా... బంగ్లా అప్పటికే రివ్యూ కోల్పోవడంతో బ్యాట్స్‌మెన్‌కు మరో అవకాశం లేకుండా పోయింది. మరో మూడు బంతులకే జడేజా బౌలింగ్‌లో మొసద్దిక్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో మెహదీ హసన్, కెప్టెన్‌ మొర్తజా (32 బంతుల్లో 26; 2 సిక్సర్లు) కలిసి పోరాడారు. చహల్‌ బౌలింగ్‌లో మెహదీ రెండు సిక్సర్లు బాదగా... భువనేశ్వర్‌ ఓవర్లో మొర్తజా వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే తర్వాతి బంతికే అతను ఔట్‌ కావడంతో 66 పరుగుల ఎనిమిదో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. మరో ఆరు పరుగులకే బంగ్లా తర్వాతి రెండు వికెట్లు కోల్పోయింది. ఐదుగురు రెగ్యులర్‌ బౌలర్లు కోటా పూర్తిగా వేయడంతో గత మ్యాచ్‌లో చెలరేగిన కేదార్‌ జాదవ్‌ అవసరమే భారత్‌కు రాలేదు.  

రాణించిన ధావన్‌... 
స్వల్ప ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించారు. రోహిత్, ధావన్‌ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ను ఔట్‌ చేసి షకీబ్‌ ఈ జోడీని విడదీశాడు. మరోవైపు జోరు పెంచిన రోహిత్‌... షకీబ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 63 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు (13) ఎక్కువ సేపు నిలవలేదు. క్యాచ్‌ కోసం ముష్ఫికర్‌ చేసిన అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించినా... రివ్యూకు వెళ్లిన బంగ్లాదేశ్‌ సానుకూల ఫలితం సాధించింది. ఈ దశలో రోహిత్, ధోని చకచకా పరుగులు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు.

ఘన పునరాగమనం
గత ఏడాది జూలైలో రవీంద్ర జడేజా భారత్‌ తరఫున ఆఖరిసారిగా వన్డే బరిలోకి దిగాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. అంతకుముందు రెండు వన్డేల్లో కూడా సరిగ్గా అదే ప్రదర్శన. అంతే... ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజాపై సెలక్టర్లు నమ్మకం కోల్పోయారు. ముందుగా కాస్త విశ్రాంతి అంటూనే మెల్లగా తప్పించేశారు. వరుసగా ఏడు వన్డే సిరీస్‌లలో అతని పేరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా ఆసియా కప్‌ జట్టులో కూడా అతని పేరు లేదు. జడేజా ఆఖరి మ్యాచ్‌ తర్వాతి నుంచి బుధవారం పాక్‌తో మ్యాచ్‌ వరకు భారత్‌ 27 వన్డేలు ఆడింది. కెప్టెన్‌ కోహ్లి అండగా చహల్, కుల్దీప్‌ జట్టులో పాతుకుపోవడంతో ఇన్ని మ్యాచ్‌లలో జడేజా అవసరమే గుర్తుకు రాలేదు. అయితే అదృష్టం అతడిని మళ్లీ మరో ఆటగాడి గాయం రూపంలో పలకరించింది. పాండ్యా గాయం కారణంగా అతను టీమ్‌లోకి వచ్చాడు. దుబాయ్‌ పిచ్‌ అదనపు పేసర్‌కంటే మూడో స్పిన్నర్‌కే అనుకూలంగా కనిపిస్తుండటంతో నేరుగా తుది జట్టులో చోటు ఖాయమైంది. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని అతను బ్రహ్మాండంగా వాడుకున్నాడు. తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. అదే తరహా కచ్చితత్వం, నియంత్రణతో కూడిన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. చకచకా నాలుగు వికెట్లు పడగొట్టి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

2014 ఆగస్టు తర్వాత జడేజా ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో అవకాశం దక్కని జడేజా... అశ్విన్‌ గాయంతో చివరి టెస్టులోకి వచ్చి 7 వికెట్లు, అర్ధ సెంచరీతో సత్తా చాటినట్లుగా ఇప్పుడు వన్డేల్లో కూడా అదే తరహాలో చేసి చూపించాడు.  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జడేజా తొలి ఓవర్‌లో షకీబ్‌ (17) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే రోహిత్, ధోని వ్యూహం మార్చి ఫీల్డర్‌ను పెట్టడంతో నేరుగా అతను స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత చక్కటి బంతితో మిథున్‌ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిథున్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. తన తర్వాతి ఓవర్‌లో ముష్ఫికర్‌ (21)ను కూడా పెవిలియన్‌ పంపించిన జడేజా... మధ్యలో కొంత విరామం తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగి తన ఆఖరి ఓవర్‌లో మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఎంతో సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాతవన్డే మ్యాచ్‌ ఆడాను. ఎక్కడైనా నాదైన ముద్రచూపించాలని భావించా. ఎప్పుడు అవకాశంలభించినా నా సామర్థ్యానికి తగినట్లుగా అత్యుత్తమప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా అనిపిస్తోంది. కుల్దీప్, చహల్‌ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడం వల్ల నేను వికెట్లు తీయడం సులువైంది. ప్రతీ మ్యాచ్‌లో నా బాధ్యత నెరవేర్చాలి. పాకిస్తాన్‌తో పాటు తర్వాతి మ్యాచ్‌లలో కూడా రాణించాలని పట్టుదలగా ఉన్నా. 
– రవీంద్ర జడేజా    

►వన్డే కెరీర్‌లో రవీంద్ర జడేజాకిది పదో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు. నాలుగేళ్ల తర్వాత మరోసారి అతనికి ఈ పురస్కారం లభించింది. చివరిసారి అతను 2014లో ఢాకాలో జరిగిన ఆసియా కప్‌లో
అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈ అవార్డు దక్కించుకున్నాడు.   

►ఒకే వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన ఏడో భారతీయ ఫీల్డర్‌గా శిఖర్‌ ధావన్‌ గుర్తింపు పొందాడు. గతంలో సునీల్‌ గావస్కర్‌ (పాక్‌పై షార్జాలో; 1985), అజహరుద్దీన్‌ (పాక్‌పై టొరంటోలో; 1997), సచిన్‌ టెండూల్కర్‌ (పాక్‌పై ఢాకాలో; 1998), రాహుల్‌ ద్రవిడ్‌ (విండీస్‌పై టొరంటోలో; 1999), మొహమ్మద్‌ కైఫ్‌ (శ్రీలంకపై జొహన్నెస్‌బర్గ్‌లో; 2003), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (జింబాబ్వేపై పెర్త్‌లో; 2004) ఈ ఘనత సాధించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement