భారీ విజయంతో ఫైనల్లోకి భారత్‌ | India beat Bangladesh by 10 wickets in the semis | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో ఫైనల్లోకి భారత్‌

Published Sat, Jul 27 2024 4:26 AM | Last Updated on Sat, Jul 27 2024 7:40 AM

India beat Bangladesh by 10 wickets in the semis

సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 10 వికెట్లతో జయభేరి

రాణించిన రేణుక, రాధ

స్మృతి మంధాన మెరుపులు

ఆదివారం శ్రీలంకతో టైటిల్‌ పోరు

దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్‌ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్‌ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్‌కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది.

 టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్‌ నిగార్‌ సుల్తానా (32), షోర్ణా అక్తర్‌ (19 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. 

ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌), షఫాలీ వర్మ (26 నాటౌట్‌) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్‌ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ జట్టును ఓడించింది. 

రేణుక అదుర్స్‌ 
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ దిలారా అక్తర్‌ (6)ను అవుట్‌ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్‌లో ఇస్మా (8)ను పెవిలియన్‌కు పంపించింది. ఆరో ఓవర్‌లో ముర్షిదా ఖాతూన్‌ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది.  

ఇద్దరే కొట్టేశారు 
స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్‌ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. 

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: దిలారా అక్తర్‌ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్‌ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్‌ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్‌ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్‌ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్‌) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్‌) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్‌: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. 
భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (నాటౌట్‌) 26; స్మృతి (నాటౌట్‌) 55; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 83. బౌలింగ్‌: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్‌ 3–0–17–0, రాబియా ఖాన్‌ 2–0–10–0, రుమానా  అహ్మద్‌ 1–0–5–0.

9 మహిళల ఆసియాకప్‌లో (వన్డే, టి20 ఫార్మాట్‌ కలిపి) భారత జట్టు ఫైనల్‌ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.

1 టి20 క్రికెట్‌లో రెండుసార్లు 20వ ఓవర్‌ మెయిడెన్‌ వేసిన తొలి బౌలర్‌గా రాధ యాదవ్‌ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా పురుషుల క్రికెట్‌లో ఎనిమిది 
మంది, మహిళల క్రికెట్‌లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను మెయిడెన్‌ చేశారు.

3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్‌.. 2019లో వెస్టిండీస్‌పై 104 పరుగుల టార్గెట్‌ను వికెట్‌ కోల్పోకుండా అధిగమించింది.

2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్‌ (4348; న్యూజిలాండ్‌) టాప్‌ ర్యాంక్‌లో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement