మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.
గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.
చెలరేగిన భారత బౌలర్లు
పేసర్ రేణుకా సింగ్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది.
మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్‌ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
లోయర్ ఆర్డర్‌లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లే పూర్తి చేశారు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.
స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్‌లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.
చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment