నేడు అండర్–19 ఆసియా కప్ ఫైనల్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది.
ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్‌తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్‌పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది.
13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది.
సెమీఫైనల్లో పాక్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment