
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ హసన్ అలీతో పాటు అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గర్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు లెవల్–1 నిబంధనను అతిక్రమించినందుకు గాను వారి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక్కో డీ మెరిట్ పాయింట్‌ను కేటాయించింది.
రషీద్, హసన్‌లకు డీ మెరిట్ పాయింట్లు లభించడం ఇదే తొలిసారి కాగా... అస్గర్‌కు రెండోసారి. అతను 24 నెలల వ్యవధిలో మరోసారి నిబంధనలను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ నిషేధం పడనుంది.
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్ వేస్తున్న పాక్ ఆల్‌రౌండర్ హసన్ అలీ ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్ హష్మతుల్లా వైపు బంతి విసిరగా... ఆ తర్వాత 37వ ఓవర్‌లో అఫ్గాన్ కెప్టెన్ అస్గర్... బౌలింగ్ చేయడానికి వెళ్తున్న హసన్‌ను కావాలనే భుజంతో ఢీకొట్టాడు. ఇక స్పిన్నర్ రషీద్ పాక్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీని ఔట్ చేశాక అభ్యంతరకరంగా అతన్ని సాగనంపాడు. వీటిపై ఐసీసీ చర్యలు తీసు కుంది. మ్యాచ్ అనంతరం ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను అంగీకరించారు.