3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ల ధాటికి వరల్డ్ నంబర్ 2 టీమ్ పేకమేడలా కూలింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1)లు పాక్ ఆటగాళ్ల భరతం పట్టారు. ఫలితంగా ఆ జట్టు 47.1 ఓవర్లలో కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆరంభంలోనే వణికించారు. ముఖ్యంగా ముజీబ్ పాక్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ముజీబ్ కీలకమైన బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్‌లను (21) ఔట్ చేసి పాక్‌ను ఇరకాటంలో పడేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇమామ్ ఉల్ హాక్ (61).. ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (39)ల సాయంతో పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే మహ్మద్ నబీ.. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఇమామ్‌ల వికెట్లు పడగొట్టి పాక్‌ను భారీ స్కోర్ చేయనీకుండా కట్టడి చేశాడు.
కీలక సమయంలో షాదాబ్ ఖాన్ కూడా రనౌట్ కావడంతో పాక్ తక్కువ స్కోర్‌కే పరిమితంకాక తప్పలేదు. రషీద్ ఖాన్ సైతం కీలకమైన అఘా సల్మాన్ (7), షాహీన్ అఫ్రిది (2) వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఫకర్ జమాన్ (2) ఔట్ చేసి ఫారూకీ పాక్ పతనానికి నాంది పలకగా.. హరీస్ రౌఫ్ (1)ను ఔట్ చేసి రెహ్మాత్ పాక్ ఇన్నింగ్స్‌ను లాంఛనంగా ముగించాడు. నసీం షా (18 నాటౌట్) పాక్‌ను 200 పరుగుల మార్కును దాటించడంతో సాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment