
ఇమామ్ ఉల్ హక్
దుబాయ్: భారత జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నపై పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అసహనం వ్యక్తం చేశాడు. ఇమామ్.. పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకపై సెంచరీ సాధించి ఈ ఓపెనర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. గతేడాది అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇమామ్ ఇప్పటికే వన్డేల్లో 4 సెంచరీలు సాధించాడు. ఆసియాకప్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఇమామ్‌ను.. ఓ భారత జర్నలిస్ట్ ‘మీ మామ ఇంజుమామ్ ఉల్ హక్ చాలా సేపు నిద్రపోయేవాడు. నీవు కూడా అతనిలా నిద్రపోతావా?’ అని సరదగా అడిగాడు. దీనికి ఆగ్రహానికి లోనైన ఇమామ్.. ‘మా మామ చాలసేపు పడుకుంటాడని నీకెలా తెలుసు? నీవేమైనా ఆయనతో పడుకున్నావా?’ అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న జర్నలిస్ట్‌లు అవాక్కయ్యారు. సరదాగా అడిగిన ప్రశ్నకు ఇంత సీరియస్ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఆసియాకప్‌లో ప్రతి మ్యాచ్ తనకు ముఖ్యమేనని, భారత్‌తో మ్యాచ్ తనకేం ప్రత్యేకం కాదని ఈ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
‘అన్ని మ్యాచ్‌లు సమానమే. అది హాంకాంగ్ అయినా భారతైనా ఒక్కటే. ప్రతీ ప్రత్యర్థిని ఒకేలా చూస్తాం. అలానే వ్యూహాలు రచిస్తున్నాం. కేవలం భారత్‌తో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టలేదు. కానీ భారత్ ఓ బలమైన జట్టు. కోహ్లి గైర్హాజరీతో వారిని ఢీకొట్టడం ప్రత్యేకం.’ అని ఈ ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇమామ్ మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. తన మామ ఇంజుమామ్ వల్లే తనకు జట్టులో చోటు దక్కిందన్న మీడియా విమర్శలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంజుమామ్ తనకు మేనమామ కావడం తన తప్పు కాదని స్పష్టం చేశాడు. విమర్శలును తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పానని, ఆసియాకప్‌లో సైతం రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment