ఊరించి... ఉత్కం‘టై’ | Afghanistan pull off last ball tie | Sakshi
Sakshi News home page

ఊరించి... ఉత్కం‘టై’

Published Wed, Sep 26 2018 1:39 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Afghanistan pull off last ball tie - Sakshi

దుబాయ్‌: చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్‌తో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్‌ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్‌ సగర్వంగా ఆసియా కప్‌ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్‌ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్‌ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్‌), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు.  నేడు జరిగే చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్‌తో ఆడుతుంది.  

రాణించిన నబీ... 
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం ఓపెనర్‌ షహజాద్‌ అద్భుత బ్యాటింగ్‌. టాప్‌–6 లో మిగతా ఐదుగురు విఫలమైన చోటు అతనొక్కడే మెరుపు ప్రదర్శనతో జట్టును నడిపించాడు. దీంతో పాటు చివర్లో నబీ ఆడిన ఇన్నింగ్స్‌ అఫ్గాన్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనుభవం తక్కువగా ఉన్న భారత పేసర్లు తడబడటంతో షహజాద్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 పరుగుల వద్ద మిడాఫ్‌లో సునాయాస క్యాచ్‌ను రాయుడు వదిలేయడంతో బతికిపోయిన షహజాద్‌ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది. అయితే స్పిన్నర్లు రంగప్రవేశం చేసి మరో ఎండ్‌లో అఫ్గాన్‌ లైనప్‌ను దెబ్బ తీశారు. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అహ్మదీ (5), రహ్మత్‌ (3)లను జడేజా ఔట్‌ చేయగా... వరుస బంతుల్లో హష్మతుల్లా (0), అస్గర్‌ (0)లను కుల్దీప్‌ పెవిలియన్‌ పంపించాడు. అయితే షహజాద్‌ మాత్రం జోరు తగ్గించలేదు. తన ధాటిని కొనసాగించిన అతను చహర్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టి 88 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 131  కాగా, షహజాద్‌వే 103 పరుగులు ఉండటం అతని బ్యాటింగ్‌ దూకుడును చూపిస్తోంది. ఎట్టకేలకు జాదవ్‌ ఈ మెరుపు బ్యాటింగ్‌కు ముగింపు పలికాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో షహజాద్‌ ఆట ముగిసింది. అయితే మరో ఎండ్‌లో నబీ కూడా ధాటిని ప్రదర్శించాడు. 45 బంతుల్లోనే అతనూ హాఫ్‌ సెంచరీ సాధించి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి పది ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ 63 పరుగులు చేసింది.  

సెంచరీ భాగస్వామ్యం... 
ఛేదనలో భారత్‌కు కొత్త ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, రాయుడు అఫ్గాన్‌ బౌలర్లపై చెలరేగారు. 10 పరుగుల వద్ద రాయుడుకు అదృష్టం కలిసొచ్చింది. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే అవకాశం కనిపించినా... అఫ్గాన్‌ జట్టు రివ్యూ కోరకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు దూసుకుపోయారు. ముఖ్యంగా గుల్బదిన్‌ వేసిన 4 ఓవర్ల స్పెల్‌లో భారత్‌ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు రాబట్టింది. ముందుగా 43 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే జోరులో మరో భారీ షాట్‌ ఆడబోయిన అతను వెనుదిరిగాడు. తర్వాతి బంతికే హాఫ్‌ సెంచరీని చేరుకున్న రాహుల్‌ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌ చేరాడు. దురదృష్టవశాత్తూ ధోని (8) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా... భారత్‌ అప్పటికే రివ్యూ కోల్పోవడంతో మరో అవకాశం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. పాండే (8) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జాదవ్‌ (19) రనౌట్‌ కాగా, కార్తీక్‌ (66 బంతుల్లో 44; 4 ఫోర్లు) కూడా కీలక సమయంలో ఔటయ్యాడు.  ఆ తర్వాత అనుభవం లేని భారత బ్యాటింగ్‌ తీవ్ర ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement