ఊరట విజయం | The success of relief | Sakshi
Sakshi News home page

ఊరట విజయం

Published Thu, Mar 6 2014 12:37 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

ఊరట విజయం - Sakshi

ఊరట విజయం

 జట్టుకు కాస్త ఉపశమనం లభించింది. బౌలర్ల రాణింపుతో పసికూన అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే నామమాత్రపు మ్యాచ్‌లోనూ రిజర్వ్‌బెంచ్‌లో ఆటగాళ్లకు కోహ్లి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు రహానేను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేశాడు. మొత్తం మీద ఆసియాకప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్నా... బంగ్లాదేశ్‌లోనే మరో 15 రోజుల్లో ప్రారంభమయ్యే టి20 ప్రపంచకప్‌కు ఈ టోర్నీ ఓ సన్నాహకం అనుకోవాలి.
 
 మిర్పూర్

ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు గాడిలో పడ్డారు. ముగ్గురూ కలిసి ఎనిమిది వికెట్లు తీసి పసికూన అఫ్ఘానిస్థాన్‌ను నిలువరించారు. దీంతో బుధవారం జరిగిన నామమాత్రపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లిసేన 8 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై విజయం సాధించింది. తద్వారా గెలుపుతో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 45.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. సమీయుల్లా షెన్వారీ (73 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్సర్), నూర్ అలీ జద్రాన్ (35 బంతుల్లో 31; 6 ఫోర్లు) రాణించారు. జడేజా (4/30), అశ్విన్ (3/31)లు స్పిన్ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. షమీ రెండు, మిశ్రా ఒక్క వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 32.2 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (78 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్సర్), అజింక్యా రహానే (66 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.
 
 
     ముగ్గురు మినహా...


 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ను భారత బౌలర్లు పూర్తిగా నియంత్రించారు. దీంతో ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆరంభంలో షమీ, భువనేశ్వర్ లైన్ మిస్ కావడంతో నూర్ అలీ, నౌరోజ్ (5) తొలి రెండు ఓవర్లలోనే 23 పరుగులు రాబట్టారు. కానీ 6వ ఓవర్‌లో నౌరోజ్ అవుట్‌తో వికెట్ల పతనం మొదలైంది. అనుభవం లేని అఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్‌ను జడేజా, అశ్విన్ పేకమేడలా కూల్చారు. షహజాద్ (28 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్సర్) మోస్తరుగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో అఫ్ఘాన్ 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సమీయుల్లా చాలాసేపు ప్రతిఘటించాడు. వికెట్‌ను కాపాడుకుంటూనే వేగంగా ఆడాడు. షాపూర్ (1)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 26, దౌలత్ (2)తో కలిసి ఆఖరి వికెట్‌కు 22 పరుగులు జోడించడంతో అఫ్ఘాన్ 150 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో సమీయుల్లా 70 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
 
 
 
 ఓపెనర్లు ధీమాగా


 అప్ఘాన్ ఇన్నింగ్స్ తొందరగా ముగియడంతో బ్రేక్‌కు ముందే భారత్ లక్ష్య ఛేదన ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన రహానే, ధావన్ ఇద్దరూ ఆచితూచి ఆడి 9 ఓవర్లలో 34 పరుగులు చేశాక బ్రేక్‌కు వెళ్లారు. క్రమంగా జోరు పెంచిన ఈ ఇద్దరూ ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా షాట్లు ఆడారు. ధావన్ 69 బంతుల్లో, రహానే 60 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి జట్టును విజయం ముంగిట నిలిపారు. మూడు పరుగుల వ్యవధిలో ఈ జోడి అవుటైనా... రోహిత్ (24 బంతుల్లో 18 నాటౌట్, 1 ఫోర్), కార్తీక్ (27 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు)లు సమయోచితంగా ఆడుతూ గెలుపునకు అవసరమైన పరుగులు జోడించారు. నబీ, అషఫ్ ్రచెరో వికెట్ తీశారు. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్‌కు బోనస్‌తో కలిపి 5 పాయింట్లు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement