బంగ్లాదేశ్ కథ ముగించేశారు | India's grand Test victory | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ కథ ముగించేశారు

Published Tue, Feb 14 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

బంగ్లాదేశ్  కథ ముగించేశారు

బంగ్లాదేశ్ కథ ముగించేశారు

ఏకైక టెస్టులో భారత్‌ ఘన విజయం 
208 పరుగులతో బంగ్లాదేశ్‌ చిత్తు
చివరి రోజు 65.3 ఓవర్ల పాటు పోరాటం 
చెరో 4 వికెట్లు తీసిన జడేజా, అశ్విన్‌


ఊహించిన ఫలితమే వచ్చింది. కాకపోతే కాస్త ఆలస్యంగా. బలహీన ప్రత్యర్థిని తొందరగా చుట్టేద్దామని భారత్‌ భావించినా... ఆట ఐదో రోజు రెండు సెషన్ల వరకు సాగింది. ఎట్టకేలకు ఆఖరి రోజు 65.3 ఓవర్ల పోరాటం అనంతరం బంగ్లాదేశ్‌ తలవంచింది. స్పిన్, పేస్‌ కలగలిసి కొట్టిన దెబ్బకు ఆ జట్టు కోలుకోలేకపోయింది. సొంతగడ్డపై భారత్‌ తన హవా కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ సొంతం. కెప్టెన్‌గా పరాజయమనేదే లేకుండా వరుసగా 19 టెస్టులు. సొంతగడ్డపై సీజన్‌లో ఆడిన 9 టెస్టుల్లో ఎనిమిదో గెలుపు. కోహ్లి నాయకత్వంలో టీమిండియా జోరు కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌ వేదికగా టెస్టు బేబీలను చిత్తు చేసి మన బృందం ఇదే ఉత్సాహంతో మరి కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా జట్టుకు సవాల్‌ విసిరేందుకు సై అంటోంది.

హైదరాబాద్‌: న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల తర్వాత భారత్‌ చేతిలో మట్టికరవడం బంగ్లాదేశ్‌ వంతు అయింది. ముందుగా బ్యాటింగ్, ఆ తర్వాత స్పిన్‌తో పాటు పేస్‌ బౌలింగ్‌ కూడా తమ వంతు పాత్ర పోషించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్‌కు భారీ విజయం దక్కింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 103/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (149 బంతుల్లో 64; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లు ఆడగలగడం విశేషం. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు చెరో 4 వికెట్లు దక్కగా, మిగతా రెండు వికెట్లు పేసర్‌ ఇషాంత్‌ శర్మకు లభించాయి. డబుల్‌ సెంచరీ సాధించిన కోహ్లికే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

సెషన్‌–1: కీలక ఆటగాళ్లు పెవిలియన్‌కు
చివరి రోజు 90 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుందామనే ఆశతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. జడేజా వేసిన ఈ ఓవర్లో షకీబ్‌ అల్‌ హసన్‌ (22) పెవిలియన్‌ చేరాడు. ఆఫ్‌ స్టంప్‌పై కచ్చితత్వంతో వేసిన ఈ బంతి టర్న్, బౌన్స్‌ కారణంగా అనూహ్యంగా దూసుకొచ్చి షకీబ్‌ గ్లవ్స్‌కు తగిలిన అనంతరం షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌ చేతుల్లో పడింది. ఈ దశలో మహ్ముదుల్లా, ముష్ఫికర్‌ (23) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మహ్ముదుల్లా కొద్ది సేపటికే 115 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కీలక సమయంలో నిర్లక్ష్యమైన ఆటతీరుతో కెప్టెన్‌ తన జట్టును మరింత కష్టాల్లో పడేశాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ముందుకు దూసుకొచ్చి షాట్‌ ఆడిన ముష్ఫికర్‌ మిడాఫ్‌లో జడేజాకు సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు. మరోవైపు అశ్విన్‌ ఓవర్లోనే మహ్ముదుల్లా ఫోర్, సిక్స్‌ బాది దూకుడు ప్రదర్శించాడు.
ఓవర్లు: 31, పరుగులు: 99, వికెట్లు: 2

సెషన్‌–2: బంగ్లా పతనం
లంచ్‌ వరకు జాగ్రత్తగా వికెట్‌ను కాపాడుకున్న షబ్బీర్‌ రహమాన్‌ (22) విరామం తర్వాత కొద్ది సేపటికే ఇషాంత్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 51 పరుగుల ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. కీలకమైన మహ్ముదుల్లా వికెట్‌ కూడా ఇషాంత్‌కే దక్కింది. అతని షార్ట్‌ పిచ్‌ బంతిని పుల్‌షాట్‌ ఆడబోయిన మహ్ముదుల్లా లాంగ్‌లెగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. కొద్ది సేపు పోరాడిన మెహదీ హసన్‌ (23)తో పాటు తైజుల్‌ (6)లను జడేజా పెవిలియన్‌ పంపించగా, తస్కీన్‌ (1)ను చివరి వికెట్‌గా అవుట్‌ చేసి అశ్విన్‌ భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఓవర్లు: 33.3, పరుగులు: 48, వికెట్లు: 5

రెండు సార్లు రివ్యూ
బంగ్లాదేశ్‌ ఆఖరి వికెట్‌ అవుట్‌ సమయంలో కాస్త డ్రామా చోటు చేసుకుంది. అశ్విన్‌ బౌలింగ్‌లో తస్కీన్‌ ఆడిన బంతి ఫీల్డర్‌ చేతుల్లో పడింది. భారత్‌ అప్పీల్‌ చేయడంతో ముందుగా క్యాచ్‌ అవుట్‌గా భావించిన అంపైర్‌ ఎరాస్మస్, దానిని థర్డ్‌ అంపైర్‌ను నివేదించారు. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగల్లేదని తేలడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ అని ప్రకటించేశారు కూడా. అయితే ఈ సమయంలో కోహ్లి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. మరోసారి రీప్లేలు చూసిన తర్వాత బంతి స్టంప్‌కు తగులుతోందని తేలడంతో తస్కీన్‌ అవుట్‌ కావడం... భారత జట్టులో సంబరాలు షురూ అయిపోయాయి.

19 కోహ్లి నాయకత్వంలో భారత్‌ వరుసగా 19 టెస్టుల్లో ఓటమి లేకుండా కొనసాగుతోంది. గతంలో గావస్కర్‌ (18) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు.

6 భారత్‌కు ఇది వరుసగా ఆరో సిరీస్‌ విజయం. గతంలో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టు వరుసగా ఐదు సిరీస్‌లు గెలిచింది.

15 కెప్టెన్‌గా కోహ్లికి 23 టెస్టుల్లో ఇది 15వ విజయం.

2 ఇంగ్లండ్‌ (2012లో) తర్వాత భారత్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ వందకు పైగా ఓవర్లు ఆడిన రెండో పర్యాటక జట్టుగా బంగ్లాదేశ్‌ నిలిచింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement