అబుదాబి: ఆసియా కప్‌లో 2016నాటి ఫైనల్ మ్యాచ్ పునరావృతం కానుంది. వరుసగా రెండో సారి తుది పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్‌లాంటి చివరి సూపర్–4 పోరులో గెలుపుతో బంగ్లాదేశ్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (116 బంతుల్లో 99; 9 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, మొహమ్మద్ మిథున్ (84 బంతుల్లో 60; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ కేవలం 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (105 బంతుల్లో 83; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తఫిజుర్ రహమాన్ (4/43) పాక్‌ను దెబ్బ తీశాడు.
భారీ భాగస్వామ్యం...
పాక్ లెఫ్టార్మ్ పేసర్లు జునైద్, షాహిన్ ఆఫ్రిది (2/47) ఆరంభంలో బంగ్లాను బెంబేలెత్తించారు. వీరిద్దరి జోరుకు ఆ జట్టు 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సౌమ్య సర్కార్ (0), లిటన్ దాస్ (6)లను వరుస ఓవర్లలో జునైద్ ఔట్ చేయగా, అద్భుత బంతితో మోమినుల్ (5)ను ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ ముష్ఫికర్ జట్టును ఆదుకున్నాడు. మిథున్ అతనికి అండగా నిలిచాడు. లీగ్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తరహాలోనే ఈ జోడి మరోసారి భారీ భాగస్వామ్యంతో ఆకట్టుకుంది. నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పాక్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, కెప్టెన్ సర్ఫరాజ్ వ్యూహలోపాలు కూడా బంగ్లాకు కలిసొచ్చాయి. ఈ క్రమంలో ముందుగా ముష్ఫికర్ 68 బంతుల్లో, ఆ తర్వాత మిథున్ 66 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే మిథున్‌ను ఔట్ చేసి హసన్ అలీ ఈ జోడీని విడదీశాడు. కైస్ (9) ఎక్కువ సేపు నిలబడలేదు. సెంచరీకి చేరువైన సమయంలో కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడిన ముష్ఫికర్ దురదృష్టవశాత్తూ ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ఆఫ్రిది బౌలింగ్‌లో దూరంగా వెళుతున్న బంతిని ఆడి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ టోర్నీలో రెండో సెంచరీ అవకాశం చేజారింది. ఆ తర్వాత మహ్ముదుల్లా (25) ఫర్వాలేదనిపించినా... లోయర్ ఆర్డర్ ప్రభావం చూపలేకపోయింది. 42 పరుగుల వ్యవధిలో బంగ్లా చివరి 5 వికెట్లు కోల్పోయింది.
తడబడుతూనే...
సాధారణ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ కూడా సరిగ్గా బంగ్లాలాగే ఆరంభమైంది. ఆ జట్టు 18 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్ జమాన్ (1)ను తొలి ఓవర్లోనే మెహదీ హసన్ వెనక్కి పంపగా... ముస్తఫిజుర్ తన వరుస రెండు ఓవర్లలో బాబర్ ఆజమ్ (1), సర్ఫరాజ్ (10)ల ఆట ముగించాడు. ఇలాంటి స్థితిలో ఇమామ్, షోయబ్ మాలిక్ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే బంగ్లా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్‌లో కూడా చురుగ్గా ఉండటంతో పరుగులు అతి కష్టంగా వచ్చాయి. వేలికి గాయంతో ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాడు షకీబుల్ హసన్ దూరమైనా ఆ జట్టు పార్ట్ టైమ్ బౌలర్లు చక్కగా రాణించారు. ఇమామ్, మాలిక్ మూడో వికెట్‌కు 16.4 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే జోడించగలిగారు. మిడ్ వికెట్‌లో కెప్టెన్ మొర్తజా అద్భుత క్యాచ్ పట్టడంతో మాలిక్ ఇన్నింగ్స్ ముగియగా... భారంగా ఆడిన షాదాబ్ (24 బంతుల్లో 4) ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఇమామ్ ఉల్ హఖ్ మాత్రం తన పోరాటం కొనసాగించాడు. అతనికి కొద్దిసేపు ఆసిఫ్ అలీ (47 బంతుల్లో 31; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే రెండు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని లిటన్ దాస్ స్టంపౌట్ చేయడంతో పాక్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
భళా... బంగ్లాదేశ్
Published Thu, Sep 27 2018 1:38 AM | Last Updated on Thu, Sep 27 2018 1:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment