సూపర్‌ ముష్ఫికర్‌ | Bangladesh win by 137 runs | Sakshi
Sakshi News home page

సూపర్‌ ముష్ఫికర్‌

Published Sun, Sep 16 2018 4:21 AM | Last Updated on Sun, Sep 16 2018 7:54 AM

Bangladesh win by 137 runs - Sakshi

బంగ్లా బెబ్బులి శివాలెత్తింది.  సింహళీయుల్ని చిత్తుచిత్తుగా ఓడించి ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మొదట వెటరన్‌ పేసర్‌ మలింగ పేస్‌ పదునుకు ఎదురొడ్డి నిలిచింది. బ్యాటింగ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌ సెంచరీ, మొహమ్మద్‌ మిథున్‌ అర్ధ సెంచరీతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ఒడ్డున పడేస్తే... తర్వాత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఆటల్ని సాగనివ్వలేదు. పది ఓవర్లలోపే 4 కీలక వికెట్లు తీశారు. 25 ఓవర్లకే 8 వికెట్లను పడేసి  ఘోరపరాజయాన్ని ఖాయం చేశారు.

దుబాయ్‌: ఆసియా కప్‌ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగింది. మేటి జట్లకు మేం ఏమాత్రం తీసిపోమని బరిలో ఉన్న జట్లను హెచ్చరించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 137 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముష్ఫికర్‌ రహీమ్‌ (150 బంతుల్లో 144; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు.

మొహమ్మద్‌ మిథున్‌ (68 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సరిగ్గా ఏడాది తర్వాత వన్డే ఆడిన లసిత్‌ మలింగ 4 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దిల్‌రువాన్‌ పెరీరా చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోర్‌ కాగా, మొర్తజా, ముస్తఫిజుర్‌ రహమాన్, మెహిదీ హసన్‌ మిరాజ్‌ తలా 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌తో పాకిస్తాన్‌ తలపడుతుంది.  

ముష్ఫికర్‌ భారీ సెంచరీ...
లసిత్‌ మలింగ ధాటికి చెల్లాచెదురైన బంగ్లా ఇన్నింగ్స్‌కు ముష్ఫికర్‌ రహీమ్‌ మూలస్తంభంలా నిలిచాడు. తొలి ఓవర్‌ వరుస బంతుల్లో లిటన్‌ దాస్‌ (0), షకీబ్‌ (0)లను మలింగ డకౌట్‌ చేశాడు. తర్వాత ఓవర్లోనే ఓపెన్‌ తమీమ్‌ ఔట్‌ కాకుండానే క్రీజు నుంచి ఔటైపోయాడు. గాయంతో రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో 3 పరుగులకే టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌లో కూర్చున్నారు. ఈ దశలో రహీమ్, మొహమ్మద్‌ మిథున్‌లిద్దరు మలింగ పేస్‌కు ఎదురునిలిచి జట్టును ఆదుకున్నారు.

13 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. వీళ్లిద్దరు పాతుకుపోవడంతో మరో ఆరు ఓవర్లకే (19.3) వంద పరుగులు దాటింది. మిథున్‌ 52 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) బంతుల్లో... ముష్ఫికర్‌ 67 (3 ఫోర్లు, 1 సిక్స్‌) బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అలా 25 ఓవర్ల దాకా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు కుదుటపడిన దశలో మలింగ మళ్లీ బంగ్లాదేశ్‌ను కుదిపేశాడు. ఇన్నింగ్స్‌ 26వ ఓవర్లో ధాటిగా ఆడుతున్న మిథున్‌ను, తన తదుపరి ఓవర్లో మొసద్దక్‌ హొస్సేన్‌ (1)లను ఔట్‌ చేశాడు.

దీంతో 142 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయిన బంగ్లాను మరోసారి ముష్ఫికర్‌ చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ అండతో నిలబెట్టాడు. మెహదీ హసన్‌ మిరాజ్‌ (15), కెప్టెన్‌ మొర్తజా (11), ముస్తఫిజుర్‌ రహమాన్‌ (10)లు చేసింది తక్కువ పరుగులే అయినా... ముష్ఫికర్‌ రహీమ్‌కు అండగా నిలిచారు. దీంతో అతను 123 (7 ఫోర్లు, 1 సిక్స్‌) బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ముష్ఫికర్‌ శివమెత్తాడు. 229 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోగా... గాయంతో రిటైర్ట్‌హర్ట్‌ అయిన తమీమ్‌ క్రీజులోకి వచ్చాడు. నిజానికి అతను బ్యాటింగ్‌ చేయలేని స్థితిలో ఉన్నా... అతని అండతోనే ముష్ఫికర్‌ సిక్సర్లు, ఫోర్లతో కేవలం తొమ్మిది బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 261 పరుగుల వద్ద చివరి వికెట్‌గా నిష్క్రమించాడు.

వాళ్లు కొడితే... వీళ్లేమో వరుస కట్టారు...
ఆరంభం చెదిరినా.. బంగ్లా ఇన్నింగ్స్‌ను ఇద్దరంటే ఇద్దరే నిలబెట్టారు. కానీ ఆరంభం అదిరినా... శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఏ ఒక్కరూ కాపాడలేకపోయారు. తరంగ సిక్స్, ఫోర్‌తో తొలి ఓవర్లో 13 పరుగులు, రెండో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి కానీ చివరి బంతికి కుశాల్‌ మెండిస్‌ (0)ను ముస్తఫిజుర్‌ డకౌట్‌ చేశాడు. ఇక ఇక్కడి నుంచి లంక పతనం ప్రారంభమైంది. మరుసటి ఓవర్లోనే జోరు మీదున్న తరంగ, కాసేపటికే డిసిల్వా (0), ఇంకాస్త ముందుకెళ్లగానే కుశాల్‌ పెరీరా (11)  పెవిలియన్‌ చేరడంతో 38 పరుగులకే 4 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ముస్తఫిజుర్, మొర్తజా, మిరాజ్‌ తలా ఒక చేయి వేయడంతో ఇదంతా 9.2 ఓవర్లకే జరిగిపోయింది. ఈ వికెట్ల పతనానికి స్వల్ప విరామం దొరికింది. మళ్లీ 17వ ఓవర్‌ నుంచే లంక కష్టాలు మొదటికొచ్చాయి. దీంతో వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దిల్‌రువాన్‌ పెరీరా, లక్మల్‌ (20) నిలబడినా బంగ్లా బౌలర్లతో ఎంతోసేపు తలబడలేకపోయారు.

స్కోరు వివరాలు
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ ఇక్బాల్‌ నాటౌట్‌ 2; లిటన్‌ దాస్‌ (సి) మెండిస్‌ (బి) మలింగ 0; షకీబుల్‌ (బి) మలింగ 0; ముష్ఫికర్‌ (సి) మెండిస్‌ (బి) తిసారా పెరీరా 144; మిథున్‌ (సి) దిల్‌రువాన్‌ పెరీరా (బి) మలింగ 63; మహ్మూదుల్లా (సి) డిసిల్వా (బి) అపొన్సో 1; హొస్సేన్‌ (సి) దిల్‌రువాన్‌ పెరీరా (బి) మలింగ 1; మెహదీ హసన్‌ (సి అండ్‌ బి) లక్మల్‌ 15; మొర్తజా (సి) తరంగ (బి) డిసిల్వా 11; రూబెల్‌ హొస్సేన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) డిసిల్వా 2; ముస్తఫిజుర్‌ (రనౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 261.

వికెట్ల పతనం: 1–1, 2–1, 2–3, 3–134, 4–136, 5–142, 6–175, 7–195, 8–203, 9–229, 10–261.

బౌలింగ్‌: మలింగ 10–2–23–4, లక్మల్‌ 10–0–46–1, అపొన్సో 9–0–55–1, తిసారా పెరీరా 7.3–0–51–1, దిల్‌రువాన్‌ పెరీరా 3–0–25–0, ధనంజయ డిసిల్వా 7–0–38–2, షనక 3–0–19–0.

శ్రీలంక ఇన్నింగ్స్‌: తరంగ (బి) మొర్తజా 27; మెండిస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్‌ 0; కుశాల్‌ పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్‌ 11; ధనంజయ డిసిల్వా ఎల్బీడబ్ల్యూ (బి) మొర్తజా 0; మాథ్యూస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రూబెల్‌ హొస్సేన్‌ 16; షనక (రనౌట్‌) 7; తిసారా పెరీరా (సి) రూబెల్‌ హొస్సేన్‌ (బి) మెహదీ హసన్‌ 6; దిల్‌రువాన్‌ పెరీరా (స్టంప్డ్‌) లిటన్‌ దాస్‌ (బి) మొసద్దక్‌ హొస్సేన్‌ 29; లక్మల్‌ (బి) ముస్తఫిజుర్‌ 20; అపొన్సో (సి) సబ్‌–నజ్ముల్‌ హొస్సేన్‌ (బి) షకీబ్‌ 4; మలింగ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35.2 ఓవర్లలో ఆలౌట్‌) 124.

వికెట్ల పతనం: 1–22, 2–28, 3–32, 4–38, 5–60, 6–63, 7–69, 8–96, 9–120, 10–124.  

బౌలింగ్‌: మష్రఫే మొర్తజా 6–2–25–2, ముస్తఫిజుర్‌ 6–0–20–2, మెహదీ హసన్‌ మిరాజ్‌ 7–1–21–2, షకీబ్‌ 9.2–0–31–1, రూబెల్‌ హొస్సేన్‌ 4–0–18–1, మొసద్దక్‌ హొస్సేన్‌ 3–0–8–1.  

1: ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (144). శ్రీలంక కీపర్‌ సంగక్కర (121; బంగ్లాదేశ్‌పై 2008లో) పేరిట ఉన్న రికార్డును రహీమ్‌ సవరించాడు.


6:ఆసియా కప్‌లో సెంచరీ చేసిన ఆరో వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌. గతంలో సంగక్కర నాలుగు సెంచరీలు చేయగా... రాహుల్‌ ద్రవిడ్, ధోని, ఉమర్‌ అక్మల్, అనాముల్‌ హక్‌ ఒక్కో సెంచరీ సాధించారు.  


1: ఆసియా కప్‌ వన్డే టోర్నీలోని ఓ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోని తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడటం ఇదే మొదటిసారి.  

2: ఆసియా కప్‌ చరిత్రలో శ్రీలంకతో 13 సార్లు ఆడిన బంగ్లాదేశ్‌కు కేవలం ఇది రెండో గెలుపే. ఓవరాల్‌గా శ్రీలంకతో 45 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్‌కిది ఏడో విజయం మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement