
అబుదాబి: బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించడంతో ఆఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంకకు 250 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ సారథి అస్ఘర్ ఆఫ్గాన్ నమ్మకాన్ని బ్యాట్స్‌మెన్ నిలబెట్టారు. తొలుత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 57 పరుగుల జోడించిన అనతరం ఓపెనింగ్ జోడిని లంక స్పిన్నర్ అఖిల ధనుంజయ విడదీశాడు. మహ్మద్ షాజాద్(34; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్)ను వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా(72; 90 బంతుల్లో 5ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఇషానుల్లా జనత్( 45; 65 బంతుల్లో 6 ఫోర్లు) లంక బౌలర్లకు పరీక్ష పెట్టారు.
రెండో వికెట్‌కు అర్దసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి ధనుంజయ విడదీశాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ శుభారంబాన్ని అందించినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ చేయటంలో విఫలమయ్యారు. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. లంక పేసర్ తిశార పెరీరా ఐదు వికెట్లు తీసి మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. మిగతా లంక బౌలర్లలో ధనుంజయ రెండు వికెట్లు తీయగా, మలింగ, చమీరా, జయసూర్య తలో వికెట్ సాధించారు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 124 పరుగులకే ఆలౌటై 137 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment