క్రికెట్‌ ‘డాక్టర్‌’ ఇక లేరు | Hyderabad Former Captain MV Sridhar dead | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ‘డాక్టర్‌’ ఇక లేరు

Published Tue, Oct 31 2017 12:01 AM | Last Updated on Tue, Oct 31 2017 12:01 AM

Hyderabad Former Captain MV Sridhar dead

మోముపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు... హోదాతో సంబంధం లేకుండా ఆత్మీయ పలకరింపు... ఒకవైపు క్రికెట్‌ పరిపాలనలో చురుకైన పాత్ర... మరోవైపు ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల నిర్వహణ... ఎలాంటి బాధ్యతనైనా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు... క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే అలుపెరగని ఆల్‌రౌండర్‌... ఆయనే మాటూరి వెంకట (ఎంవీ) శ్రీధర్‌. హైదరాబాద్‌ రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో క్రికెట్‌ వ్యవహారాలను పర్యవేక్షించే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) పదవిని అలంకరించారు. కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ కారణంతో గత నెలలో తన పదవికి రాజీనామా చేసే వరకు ఆయన తన కార్యదక్షతతో ఆ పదవికే వన్నె తెచ్చారంటే అతిశయోక్తి కాదు.   

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌), హైదరాబాద్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మాటూరి వెంకట  శ్రీధర్‌ సోమవారం కన్ను మూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 14, బీఎన్‌ రెడ్డి కాలనీలోని తన స్వగృహంలో మధ్యాహ్నం భోజనం చేశాక ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్రీధర్‌ అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. స్కానింగ్‌ చేస్తుండగానే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తరలించారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 51 ఏళ్ల శ్రీధర్‌కు భార్య సాగరిక, కొడుకు, కూతురు ఉన్నారు.  

ఆ ‘ట్రిపుల్‌’ సెంచరీ అద్భుతం...
విజయవాడలో 1966 ఆగస్టు 2న జన్మించిన ఎంవీ శ్రీధర్‌ 1988లో హైదరాబాద్‌ రంజీ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగారు. 2000 వరకు కొనసాగిన ఆయన కెరీర్‌లో మొత్తం 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. 150 ఇన్నింగ్స్‌లో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 6,701 పరుగులు సాధించారు. 1989లో మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ సారథ్యంలో దులీప్‌ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన సౌత్‌జోన్‌ జట్టులో శ్రీధర్‌ సభ్యుడిగా ఉన్నారు. 1994 జనవరిలో ఆంధ్ర జట్టుతో సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రీధర్‌ ‘ట్రిపుల్‌ సెంచరీ’తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. శ్రీధర్‌ ట్రిపుల్‌ సెంచరీతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 ఓవర్లలో 6 వికెట్లకు 944 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. రంజీ చరిత్రలో ఇప్పటికీ ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో శ్రీధర్‌ 699 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి 523 బంతులు ఆడి 37 ఫోర్లు, 5 సిక్సర్లతో 366 పరుగులు చేసి అవుటయ్యారు. రంజీ క్రికెట్‌ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన శ్రీధర్‌ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నపుడు జాతీయ జట్టులో కూడా మిడిల్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉండటంతో ఆయనకు భారత జట్టులో ఆడే అవకాశం రాలేదు.  

‘డాక్‌’గా సుపరిచితం...
హైదరాబాద్‌ కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన శ్రీధర్‌ను క్రికెట్‌ వర్గాల్లో ముద్దుగా ‘డాక్‌’ అని పిలుస్తారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక ఆయన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాల్లో అడుగు పెట్టారు. 2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా... 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా.. 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్‌ రంజీ జట్టు కోచ్‌ పదవికి వెంకటపతిరాజు రాజీనామా చేశాక 2010–2011 సీజన్‌లో కొంతకాలం ఆయన తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఎన్‌. శ్రీనివాసన్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్రీధర్‌ను 2013లో బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా నియమించారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉన్న ఆయన గత నెలలో 27న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీధర్‌ భారత క్రికెట్‌ జట్ల మ్యాచ్‌ షెడ్యూల్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఐసీసీ సమావేశాల్లో బోర్డు ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. గత ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. ఈ ఏడాది జూన్‌లో కోచ్‌ అనిల్‌ కుంబ్లే రాజీనామా తర్వాత విండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కాలేజి, ఎంవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలను నిర్వహిస్తున్న ఆయన కొంతకాలం హైదరాబాద్‌లోని టెక్‌ మహీంద్రాలో హెచ్‌ఆర్‌–రిక్రూట్‌మెంట్, రిలేషన్స్‌ విభాగానికి గ్లోబల్‌ హెడ్‌గా కూడా పనిచేశారు.  

సీఎం కేసీఆర్‌ సంతాపం
సీనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్, హైదరాబాద్‌ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఎంవీ శ్రీధర్‌ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలియజేశారు. క్రికెటర్‌గా, హెచ్‌సీఏ కార్యదర్శిగా శ్రీధర్‌ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో క్రికెట్‌ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతిరాజు, వీవీఎస్‌ లక్ష్మణ్, ఎంవీ నరసింహారావు, నోయల్‌ డేవిడ్, ప్రముఖ కామెంటేటర్‌ హర్ష భోగ్లే, హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేక్, మాజీ కార్యదర్శి పీఆర్‌ మాన్‌సింగ్‌ తదితరులు శ్రీధర్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

‘మంకీగేట్‌’ వివాదం సమయంలో...
2008లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టుకు ఎంవీ శ్రీధర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. సిడ్నీ టెస్టు సందర్భంగా భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ సైమండ్స్‌ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంపై... హర్భజన్‌పై రిఫరీ మైక్‌ ప్రాక్టర్‌ మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించారు. రిఫరీ నిర్ణయంపై అప్పీల్‌ చేసిన బీసీసీఐ హర్భజన్‌పై వేటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తమ పర్యటనను అర్ధంతరంగా ముగించి స్వదేశానికి తిరిగి వచ్చేస్తామని హెచ్చరించింది. విచారణ అనంతరం హర్భజన్‌పై జాతి వివక్ష అభియోగాలను అప్పీల్‌ కమిషనర్‌ జస్టిస్‌ జాన్‌ హాన్సెన్‌ కొట్టివేసి అతనిపై మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ వివాదం సమయంలో శ్రీధర్‌ ఆటగాళ్లకు, మీడియాకు, రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలకు సంధానకర్తగా వ్యవహరించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని హర్భజన్‌ సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘శ్రీధర్‌ చాలా మంచి మనిషి. ఆయనంటే నాకెంతో గౌరవం. అడిలైడ్‌లో ఈ కేసు తీర్పు వచ్చే సమయంలో నాతో కారులో శ్రీధర్‌ ఉన్నారు. నేను ఎలా మాట్లాడాలో ఆయన నాకు సూచనలు ఇచ్చారు. వివాదం మరింత ముదరకుండా అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడిన తీరు అద్భుతం. శ్రీధర్‌ మృతితో నేనొక మంచి మిత్రుడిని కోల్పోయాను’ అని హర్భజన్‌ అన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement