mv Sridhar
-
ఎంవీ శ్రీధర్‌పై పుస్తకం
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ మాజీ క్రికెట్ ప్లేయర్ దివంగత డాక్టర్ ఎంవీ శ్రీధర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన పుస్తకం ‘ది రినాస్సాన్స్ మ్యాన్– డాక్టర్ ఎంవీ శ్రీధర్’ పుస్తకావిష్కరణ ఆదివారం జరగనుంది. ఉప్పల్ స్టేడియంలోని క్లబ్ హౌస్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ ఆవిష్కరిస్తాడు. ఈ పుస్తకాన్ని పి. హరిమోహన్ రచించారు. శ్రీధర్ జీవిత విశేషాలతో పాటు, అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇందులో ముందుమాటను భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ రాయగా... అజహరుద్దీన్, అనిల్ కుంబ్లే, వెంకటపతి రాజు, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అనురాగ్ ఠాకూర్ తమ అభిప్రాయాలను జోడించారు. ఈ పుస్తకాన్ని రచించిన హరిమోహన్ ఆల్‌సెయింట్స్ హైస్కూల్ తరఫున శ్రీధర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే సమయంలో ఆయన జూనియర్ కావడం విశేషం. -
శ్రీధర్ మృతి క్రీడాలోకానికి తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత జట్టు మాజీ అసిస్టెంట్ మేనేజర్ ఎం.వి. శ్రీధర్ ఆకస్మిక మృతి పట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘శ్రీధర్ మరణం క్రీడా లోకానికి, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్‌కు తీరని లోటు. శ్రీధర్ వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఎప్పుడూ క్రికెట్ అభివృద్ధి గురించే ఆలోచించేవాడు. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. అతనితో కలసి ఎన్నో మ్యాచులు ఆడాను. అవి నాకు మరిచిపోలేని అనుభూతులు. అతి క్లిష్టమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రాజకీయాలను ఎదుర్కొని మంచి పరిపాలకుడిగా పేరుగాంచారు. శ్రీధర్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ 2013లో జనరల్ మేనేజర్‌గా నియమించింది. ఆయన ఆట ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది. మాజీ క్రికెటర్‌గానే కాకుండా హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అతను చేసిన సేవలు నిరుపమానమైనవి. దేశవాళీ మ్యాచుల్లో శ్రీధర్ విశేష ప్రతిభ కనబరచినా జాతీయ జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీవీ ఆనంద్ అన్నారు. శ్రీధర్ పార్థీవ దేహాన్ని సందర్శించి వస్తున్న మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు -
క్రికెట్ ‘డాక్టర్’ ఇక లేరు
మోముపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు... హోదాతో సంబంధం లేకుండా ఆత్మీయ పలకరింపు... ఒకవైపు క్రికెట్ పరిపాలనలో చురుకైన పాత్ర... మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థల నిర్వహణ... ఎలాంటి బాధ్యతనైనా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు... క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే అలుపెరగని ఆల్‌రౌండర్... ఆయనే మాటూరి వెంకట (ఎంవీ) శ్రీధర్. హైదరాబాద్ రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే జనరల్ మేనేజర్ (జీఎం) పదవిని అలంకరించారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కారణంతో గత నెలలో తన పదవికి రాజీనామా చేసే వరకు ఆయన తన కార్యదక్షతతో ఆ పదవికే వన్నె తెచ్చారంటే అతిశయోక్తి కాదు. సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్), హైదరాబాద్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మాటూరి వెంకట శ్రీధర్ సోమవారం కన్ను మూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 14, బీఎన్ రెడ్డి కాలనీలోని తన స్వగృహంలో మధ్యాహ్నం భోజనం చేశాక ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్రీధర్ అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న స్టార్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. స్కానింగ్ చేస్తుండగానే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తరలించారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 51 ఏళ్ల శ్రీధర్‌కు భార్య సాగరిక, కొడుకు, కూతురు ఉన్నారు. ఆ ‘ట్రిపుల్’ సెంచరీ అద్భుతం... విజయవాడలో 1966 ఆగస్టు 2న జన్మించిన ఎంవీ శ్రీధర్ 1988లో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగారు. 2000 వరకు కొనసాగిన ఆయన కెరీర్లో మొత్తం 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. 150 ఇన్నింగ్స్‌లో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 6,701 పరుగులు సాధించారు. 1989లో మొహమ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో దులీప్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన సౌత్‌జోన్ జట్టులో శ్రీధర్ సభ్యుడిగా ఉన్నారు. 1994 జనవరిలో ఆంధ్ర జట్టుతో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రీధర్ ‘ట్రిపుల్ సెంచరీ’తో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. శ్రీధర్ ట్రిపుల్ సెంచరీతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 211 ఓవర్లలో 6 వికెట్లకు 944 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. రంజీ చరిత్రలో ఇప్పటికీ ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో శ్రీధర్ 699 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి 523 బంతులు ఆడి 37 ఫోర్లు, 5 సిక్సర్లతో 366 పరుగులు చేసి అవుటయ్యారు. రంజీ క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన శ్రీధర్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నపుడు జాతీయ జట్టులో కూడా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో ఆయనకు భారత జట్టులో ఆడే అవకాశం రాలేదు. ‘డాక్’గా సుపరిచితం... హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీధర్‌ను క్రికెట్ వర్గాల్లో ముద్దుగా ‘డాక్’ అని పిలుస్తారు. 2000లో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాక ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పరిపాలన వ్యవహారాల్లో అడుగు పెట్టారు. 2000 నుంచి 2006 వరకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శిగా... 2010 నుంచి 2012 వరకు ఉపాధ్యక్షుడిగా.. 2012 నుంచి 2014 వరకు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ పదవికి వెంకటపతిరాజు రాజీనామా చేశాక 2010–2011 సీజన్లో కొంతకాలం ఆయన తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఎన్. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్రీధర్‌ను 2013లో బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ (జీఎం)గా నియమించారు. నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉన్న ఆయన గత నెలలో 27న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీధర్ భారత క్రికెట్ జట్ల మ్యాచ్ షెడ్యూల్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఐసీసీ సమావేశాల్లో బోర్డు ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. గత ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. ఈ ఏడాది జూన్‌లో కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజిలను నిర్వహిస్తున్న ఆయన కొంతకాలం హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రాలో హెచ్ఆర్–రిక్రూట్మెంట్, రిలేషన్స్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా కూడా పనిచేశారు. సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టు మాజీ ఆటగాడు ఎంవీ శ్రీధర్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలియజేశారు. క్రికెటర్‌గా, హెచ్‌సీఏ కార్యదర్శిగా శ్రీధర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో క్రికెట్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, ఎంవీ నరసింహారావు, నోయల్ డేవిడ్, ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే, హెచ్‌సీఏ అధ్యక్షుడు జి.వివేక్, మాజీ కార్యదర్శి పీఆర్ మాన్సింగ్ తదితరులు శ్రీధర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘మంకీగేట్’ వివాదం సమయంలో... 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టుకు ఎంవీ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్‌గా వ్యవహరించారు. సిడ్నీ టెస్టు సందర్భంగా భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంపై... హర్భజన్‌పై రిఫరీ మైక్ ప్రాక్టర్ మూడు టెస్టు మ్యాచ్‌ల నిషేధం విధించారు. రిఫరీ నిర్ణయంపై అప్పీల్ చేసిన బీసీసీఐ హర్భజన్‌పై వేటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తమ పర్యటనను అర్ధంతరంగా ముగించి స్వదేశానికి తిరిగి వచ్చేస్తామని హెచ్చరించింది. విచారణ అనంతరం హర్భజన్‌పై జాతి వివక్ష అభియోగాలను అప్పీల్ కమిషనర్ జస్టిస్ జాన్ హాన్సెన్ కొట్టివేసి అతనిపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఈ వివాదం సమయంలో శ్రీధర్ ఆటగాళ్లకు, మీడియాకు, రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలకు సంధానకర్తగా వ్యవహరించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘శ్రీధర్ చాలా మంచి మనిషి. ఆయనంటే నాకెంతో గౌరవం. అడిలైడ్‌లో ఈ కేసు తీర్పు వచ్చే సమయంలో నాతో కారులో శ్రీధర్ ఉన్నారు. నేను ఎలా మాట్లాడాలో ఆయన నాకు సూచనలు ఇచ్చారు. వివాదం మరింత ముదరకుండా అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడిన తీరు అద్భుతం. శ్రీధర్ మృతితో నేనొక మంచి మిత్రుడిని కోల్పోయాను’ అని హర్భజన్ అన్నాడు. -
మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం
-
మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం
హైదరాబాద్: హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్(51) హఠాన్మరణం చెందారు. సోమవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రోజు గుండె పోటు కారణంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రీధర్.. 2013లో భారత జట్టుకు శ్రీధర్ మేనేజర్ గా సేవలందించారు. ఒక మంచి క్రికెటర్ గా, మంచి వ్యక్తిగా పేరున్న శ్రీధర్ ఆకస్మిక మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీధర్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు. 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా సేవలందించారు. హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. శ్రీధర్ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!
-
కోహ్లి, కుంబ్లే మధ్య రాజీ యత్నాలు!
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కీలకమైన పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో నెలకొన్న విభేదాలపై బీసీసీఐలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంట్లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం ఎంవీ శ్రీధర్‌ను నియమించారు. వీరు బర్మింగ్‌హామ్‌లో ఇద్దరితో విడివిడిగా సమావేశమై విభేదాలను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ఈనెల 4న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ అనంతరం బీసీసీఐ ప్రారంభించనుంది. మే 31తో అభ్యర్థుల దరఖాస్తుల గడువు ముగిసింది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఆలోపునే జట్టు కోచ్ ఎవరనేది తేలిపోతుందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ పదవి కోసం ఇప్పటిదాకా ఎవరెవరు ముందుకు వచ్చారనే విషయం బోర్డు చెప్పడం లేదు. టామ్ మూడీ పేరు బాగానే ప్రచారం అవుతున్నా బోర్డు నుంచి మాత్రం స్పందన లేదు. దరఖాస్తులన్నింటిని బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి లండన్‌లో ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులకు అందించనున్నారు. ‘ఇంటర్వూ్యలన్నీ ఇంగ్లండ్‌లోనే జరపాలా? లేదా? అనే విషయం సీఏసీ నిర్ణయిస్తుంది. ఇది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. కుంబ్లే కూడా మరోసారి కమిటీ ముందు రావాలా అనేది కూడా వారే తేలుస్తారు’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘కెప్టెన్, కోచ్ అభిప్రాయాలు ఒకేలా ఉండవు’ ఎప్పుడైనా జట్టు కెప్టెన్, కోచ్ ఒకేలా ఆలోచిస్తారనుకోవడం సరికాదని, అలా ఎప్పుడూ జరగదని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నారు. కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాల గురించి స్పందిస్తూ.. ‘అదంతా నిజమో కాదో తెలీదు కానీ చాంపియన్స్ ట్రోఫీ ముందు ఈ పరిస్థితి ఉండకూడదు. కచ్చితంగా కోచ్ అనే వ్యక్తి ప్రస్తుత తరంకన్నా ముందు ఆడినవారై ఉంటారు. అందుకే వారి దృక్పథం వేరేలా ఉంటుంది. ఇక జట్టు విజయాల గురించి మాట్లాడితే కుంబ్లే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతీ కోచ్ జట్టు 10 ఏళ్ల భవిష్యత్‌ను ఊహించి పనిచేయాలి. కెప్టెన్, కోచ్‌లతో సీఏసీ సభ్యులు మాట్లాడతారని అనుకుంటున్నాను’ అని గావస్కర్ చెప్పారు. -
ధర్మశాలలో భద్రత బాగుంది: శ్రీధర్
ధర్మశాల: టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహించే ధర్మశాలలో భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదని టోర్నమెంట్ డెరైక్టర్ ఎంవీ శ్రీధర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 9నుంచి ఈ మైదానంలో మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో శ్రీధర్ బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం 19న ఇదే వేదికపై భారత్, పాకిస్తాన్ జట్లు తలపడాల్సి ఉంది. ‘ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు చాలా బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. ఒక అధికారిగా కాకుండా సాధారణ వ్యక్తిలా వారి పనితీరును నేను దగ్గరినుంచి పరిశీలించాను. అందరిలోనూ ఇక్కడి మ్యాచ్‌లు విజయవంతం చేయాలనే కోరిక స్పష్టంగా కనిపిస్తోంది’ అని శ్రీధర్ అన్నారు. భారత్, పాక్ మ్యాచ్ పట్ల కొంత మందికి అభ్యంతరాలు ఉన్నా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున మార్చడం కష్టమన్న శ్రీధర్... మ్యాచ్ నిర్వహణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.