
హైదరాబాద్: హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్(51) హఠాన్మరణం చెందారు. సోమవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రోజు గుండె పోటు కారణంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేరిన ఆయన్ను బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రీధర్.. 2013లో భారత జట్టుకు శ్రీధర్ మేనేజర్ గా సేవలందించారు. ఒక మంచి క్రికెటర్ గా, మంచి వ్యక్తిగా పేరున్న శ్రీధర్ ఆకస్మిక మరణం పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీధర్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు.
97 ఫస్ట్‌క్లాస్ మ్యాచులాడి 6,701 పరుగులు చేశారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 21 శతకాలు, 27 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత పరుగులు 366. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా సేవలందించారు.
హైదరాబాద్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ హఠాన్మరణం పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. శ్రీధర్ కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.