
కోల్‌కతా: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్‌లలో నిరంతరాయంగా ఆడుతున్నాడు. జట్టులో సభ్యులు మారుతున్నా ఒక్క కోహ్లి మాత్రం ఎక్కడా విరామం తీసుకోవడం లేదు. సరిగ్గా చెప్పాలంటే 2016 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఎదుర్కొన్నన్ని బంతులు (4803) ఎవరూ ఎదుర్కోలేదు! అయితే ఇప్పుడు కోహ్లి కూడా తనకు విశ్రాంతి కావాలని భావిస్తున్నాడు. శ్రీలంకతో చివరి టెస్టు నుంచి అతనికి విరామం ఇవ్వవచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో కోహ్లి స్పందించాడు. ‘ఎందుకు వద్దు? కచ్చితంగా నాకు కూడా విశ్రాంతి కావాల్సిందే. నా శరీరానికి ఎప్పుడు విశ్రాంతి కావాలని అనిపిస్తే అప్పుడు అడుగుతాను. నేనేమీ యంత్రాన్ని కాను. మీరు నా శరీరాన్ని కోసి రక్తం వస్తుందా లేదా చూసుకోవచ్చు’ అని విరాట్ వ్యాఖ్యానించాడు. అయితే ‘పనిభారం’ ఎక్కువ కావడం అనే విషయం సాధారణ జనాలకు స్పష్టంగా అర్థం కాదని, అది తెలియకుండా విశ్రాంతి ఎందుకని ప్రశ్నిస్తుంటారని కోహ్లి విమర్శించాడు.
‘సాధారణంగా ఒక ఆటగాడు ఏడాదిలో 40 మ్యాచ్‌లు ఆడతాడు. అయితే తుది జట్టులోని 11 మందిపై ఒకే రకమైన భారం ఉండదు. కొందరు మాత్రమే 45 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే మరికొందరు 30 ఓవర్లు బౌలింగ్ చేస్తారు. ఆటగాళ్లందరూ ఒకే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడినా... వారు క్రీజ్‌లో గడిపిన సమయం, చేసిన పరుగులు, ఎదుర్కొన్న ఓవర్లు, పరిస్థితులు తదితర అంశాలు ప్రభావం చూపుతాయి. క్రీజ్‌లో ఎక్కువ సేపు ఉండే పుజారాకు, వచ్చీ రాగానే ధనాధన్ షాట్లు కొట్టిపోయే ఆటగాడికి మధ్య తేడా ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పనిభారం ఎంతనేది ఒక నిర్ణయానికి రావచ్చు’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకోకుండా మూడు ఫార్మాట్‌లలో ఒకే తరహా ప్రదర్శనను, అంతే తీవ్రతను కొనసాగించడం మానవమాత్రులకు అసాధ్యమని కోహ్లి తేల్చి చెప్పాడు. భారత్, శ్రీలంక మధ్య తరచుగా మ్యాచ్‌లు జరగడం అభిమానుల్లో ఆసక్తి తగ్గిస్తుందని అంగీకరించిన కోహ్లి... దీనికి ప్రత్యామ్నాయం చూడకుంటే ఫ్యాన్స్ ఆటకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అయితే నేను ఫలానా మ్యాచ్ ఆడననో, క్రీజ్‌లోకి వెళ్లాక బ్యాటింగ్ చేయబుద్ధి కావడం లేదనో చెప్పే అవకాశం క్రికెటర్లకు ఉండదని కోహ్లి స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment