'గెలుపు, ఓటములు డోంట్ కేర్'
న్యూయార్క్: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్లో వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ను, స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించిన అర్జెంటీనా ఆటగాడు డెల్ పాట్రో.. తాజాగా జరుగుతున్న యూఎస్ ఓపెన్లో ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్లో భాగంగా మూడో రౌండ్లో పాట్రో 7-6(7/3), 6-2, 6-3 తేడాతో స్పెయిన్ ఆటగాడు, పదకొండో సీడ్ రోజర్ ఫెర్రర్పై విజయం సాధించాడు. తన ప్రస్తుత ఫామ్పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పాట్రో... తాను ఆడే క్రమంలో గెలిచామా? ఓడామా? అనే విషయాన్ని ఎప్పుడూ లేకచేయనని, కేవలం తన సహజసిద్ధమైన గేమ్ను ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు.
2009 యూఎస్ ఓపెన్లో చాంపియన్గా నిలిచిన పాట్రో.. మరోసారి అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు. గతంలో తాను ఆడిన ఫోర్ హ్యాండ్ షాట్లను మరోసారి ఆడితే మాత్రం యూఎస్ గ్రాండ్ స్లామ్ను రెండోసారి కైవసం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదన్నాడు.
గత ఏడు సంవత్సరాల క్రితం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో రోజర్ ఫెదరర్ను ఓడించి సంచలన సృష్టించిన డెల్ పాట్రో తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ అందుకున్నాడు. ఆ తరువాత తరచు మణికట్టు గాయం బారిన పడ్డ పాట్రో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే రియోలో రన్నరప్గా నిలిచి రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్లో పాట్రో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.