Del Potro
-
జొకోవిచ్పై ‘ఆఖరి సవాల్’ గెలిచి...
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా): శక్తివంతమైన సర్వీస్‌లకు పెట్టింది పేరు... బుల్లెట్లా దూసుకుపోయే ఫోర్‌హ్యాండ్ షాట్లు... ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకోగల సమర్థుడు... 97 కేజీల బరువు... 6 అడుగుల 6 అంగుళాల ఆజానుబాహుడు... అతనే అర్జెంటీనా వెటరన్ టెన్నిస్ స్టార్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రో. ఎంతో సత్తా ఉన్నా గాయాల కారణంగా కెరీర్‌ను కొనసాగించలేక ఎట్టకేలకు ఆటకు టాటా చెప్పేశాడు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్పై గెలిచి డెల్ పొట్రో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ మూడో ర్యాంకర్ డెల్ పొట్రో 6–4, 7–5తో వరుస సెట్లలో సెర్బియా దిగ్గజంపై గెలిచాడు. ‘ది లాస్ట్ చాలెంజ్’ (ఆఖరి సవాల్) పేరిట జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అర్జెంటీనా మహిళా టెన్నిస్ స్టార్ గాబ్రియేలా సబటినితోపాటు పలువురు సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు విచ్చేశారు. దీంతో వీడ్కోలుకు వేదికైన పార్కే రోకా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతిమ సమరంలో విజయానంతరం అభిమానులు, ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య డెల్ పొట్రో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కోర్టులో నెట్‌ను ముద్దాడాడు. చెమర్చిన కళ్లతో వున్న అర్జెంటీనా స్టార్‌ను అనునయిస్తూ జొకోవిచ్ అభినందించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘యువాన్‌ను ప్రేమించని వారంటూ ఉండరు. అందరు అభిమానించే ఆటగాడు అతను. అతని జీవితంలో అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే అది అతని వ్యక్తిత్వమే’ అని 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత, ఆల్‌టైమ్ గ్రేటెస్ట్లలో ఒకడైన సెర్బియన్ సూపర్‌స్టార్ డెల్ పొట్రోను ఆకాశానికెత్తాడు. 2009లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)లను వరుసగా సెమీఫైనల్, ఫైనల్లో ఓడించిన డెల్‌పొట్రో తన కెరీర్లోనే ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ గాయాలు అతన్ని కుదురుగా ఆడనివ్వలేకపోవడంతో కెరీర్ అసాంతం ఫిట్నెస్ సమస్యలతోనే సతమతమయ్యాడు. అతను చివరిసారిగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా 22 టైటిళ్లను గెలుచుకున్నాడు. 36 ఏళ్ల డెల్ పొట్రో కెరీర్లో రెండు ఒలింపిక్ పతకాలు కూడా ఉన్నాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన డెల్ పొట్రో 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2016లో పురుషుల ప్రపంచ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘డేవిస్ కప్’ టైటిల్ అర్జెంటీనాకు దక్కడంలో డెల్ పొట్రో కీలకపాత్ర పోషించాడు.మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల విషయానికొస్తే... రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో (2009, 2012)... రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో (2009, 2018) క్వార్టర్ ఫైనల్ వరకు చేరాడు. వింబుల్డన్ టోర్నీలో (2013) ఒకసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 3 డెల్ పొట్రో సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్. 2018లో అత్యుత్తమంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. 439 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో గెలిచిన మ్యాచ్‌లు.174 అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో డెల్ పొట్రో ఓడిన మ్యాచ్‌లు.4418 డెల్ పొట్రో తన కెరీర్లో సంధించిన ఏస్‌లు.2,58,96,046 డాలర్లు (రూ. 219 కోట్లు) డెల్ పొట్రో కెరీర్లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ -
చెమటోడ్చిన జోకర్
రోమ్: టెన్నిస్ వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం రోమ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ యూఎస్ చాంపియన్ అర్జెంటినా ఆటగాడు డెల్ పోట్రోపై 4-6,7-6(8-6),6-4 తేడాతో చెమటోడ్చి గెలిచాడు. మోకాలి గాయంతో గత కొంత కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న పోట్రో ఆట ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. 12 ఏస్‌లతో జోకర్‌ను బెంబేలెత్తించాడు. ఓటమి నుంచి గెలుపు దిశగా.. మొదటి సెట్ గెలిచిన పోట్రో రెండో సెట్లోనూ దూకుడును ప్రదర్శించాడు. బేస్‌లైన్ షాట్స్ ఆడుతూ జోకర్‌కు చుక్కలు చూపించాడు. అయితే రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న జకోవిచ్ మ్యాచ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో 8-6తో గెలిచి రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌ను గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించాడు. సెమీఫైనల్లో మరో అర్జెంటీనా ఆటగాడు డియాగో ష్వార్జ్జ్టమాన్తో తలపడనున్నాడు. అదృష్టంతో గట్టెక్కా.. ‘‘ సరైన సమయంలో నాకు అదృష్టం తోడైంది. మొదటి సెట్లో పోట్రో అద్భుతంగా ఆడాడు. రెండో సెట్లో నేను రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత నా ఆటతీరు కాస్త గాడి తప్పింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా తిరిగి నా పూర్వపు ఫామ్‌ను అందుకున్నానని ఆశిస్తున్నాను ’’ -జకోవిచ్ -
గాయంతో నాదల్ ఔట్.. ఫైనల్‌కు డెల్ పోట్రో
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన వరల్డ్ నంబర్‌వన్ ఆటగాడు రఫెల్ నాదల్ కథ ముగిసింది. అర్జెంటీనా ఆటగాడు డెల్ పోట్రోతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆట మధ్యలో మోకాలి గాయంతో బాధపడ్డ నాదల్.. తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొలి సెట్‌ను 6-7(3/7) చేజార్చుకున్న నాదల్.. రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. అటు తర్వాత నాదల్ మోకాలి గాయం మరింత ఇబ్బంది పెట్టడంతో టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. దాంతో డెల్ పోట్రో ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. 2009లో తొలిసారి యూఎస్ ఓపెన్ గెలిచిన డెల్ పోట్రో.. మరోసారి టైటిల్ పోరుకు సిద్దమయ్యాడు. ఆదివారం జరిగే తుది పోరులో నొవాక్ జొకోవిచ్‌తో పాట్రో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇలా నాదల్ ఈ ఏడాది ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి తప్పుకోవడం రెండోసారి. అంతకుముందు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాదల్ ఇలానే వైదొలిగాడు. -
'గెలుపు, ఓటములు డోంట్ కేర్'
న్యూయార్క్: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ పురుషుల టెన్నిస్‌లో వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను, స్పెయిల్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించిన అర్జెంటీనా ఆటగాడు డెల్ పాట్రో.. తాజాగా జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో ప్రి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా మూడో రౌండ్లో పాట్రో 7-6(7/3), 6-2, 6-3 తేడాతో స్పెయిన్ ఆటగాడు, పదకొండో సీడ్ రోజర్ ఫెర్రర్‌పై విజయం సాధించాడు. తన ప్రస్తుత ఫామ్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న పాట్రో... తాను ఆడే క్రమంలో గెలిచామా? ఓడామా? అనే విషయాన్ని ఎప్పుడూ లేకచేయనని, కేవలం తన సహజసిద్ధమైన గేమ్‌ను ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. 2009 యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన పాట్రో.. మరోసారి అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు. గతంలో తాను ఆడిన ఫోర్ హ్యాండ్ షాట్లను మరోసారి ఆడితే మాత్రం యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదన్నాడు. గత ఏడు సంవత్సరాల క్రితం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి సంచలన సృష్టించిన డెల్ పాట్రో తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ అందుకున్నాడు. ఆ తరువాత తరచు మణికట్టు గాయం బారిన పడ్డ పాట్రో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే రియోలో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ఓపెన్‌లో పాట్రో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. -
'పసిడి'పై డెల్ పాట్రో గురి!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఫామ్‌తో చెలరేగిపోతున్న అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు పసిడిపై గురి పెట్టాడు. శనివారం అర్థరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో డెల్ పాట్రో సంచలన విజయం నమోదు చేసి ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా స్పెయిన్ బుల్, మూడో సీడ్ రఫెల్ నాదల్ ను బోల్తా కొట్టించిన డెల్ పాట్రో తుది పోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో పాట్రో 5-7, 6-4, 7-6(7/5) తేడాతో నాదల్‌ను ఓడించి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు. తొలి సెట్‌ను కోల్పోయిన పాట్రో.. ఆ తరువాత ఏమాత్రం బెదరకుండా నాదల్‌ను ఇంటికి పంపించాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో డెల్ పాట్రో ఒత్తిడిని జయించి ఫైనల్ కు చేరగా, నాదల్ మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనై ఓటమి పాలయ్యాడు. ప్రధానంగా టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్ లో డెల్ పాట్రో అద్భుతమైన ఏస్ లతో ఆకట్టుకున్నాడు. దీంతో రెండో ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాలన్న నాదల్ ఆశలకు బ్రేక్ పడింది.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు.కాగా, రియో ద్వారా రెండో సింగిల్స్ ఒలింపిక్ పసిడిని సాధించి మరోసారి పూర్వవైభవాన్ని చాటుకోవాలని నాదల్ యత్నించినా, డెల్ పాట్రో లాంటి పటిష్టమైన ప్రత్యర్థి ముందు తలవంచక తప్పలేదు. రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్‌ను ఇంటికి పంపిన డెల్ పాట్రో మరోసారి అదే తరహా ఆట తీరుతో నాదల్కు చుక్కలు చూపించాడు. దీంతో మరో సెమీ ఫైనల్లో జపాన్ ఆటగాడు నిషాకోరిపై విజయం సాధించిన ఆండీ ముర్రేతో అమీతుమీ తేల్చుకునేందుకు పాట్రో సిద్ధమయ్యాడు. అయితే గత నెల్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలిచి మంచి ఊపుమీద ఉన్న ముర్రేను పాట్రో ఎంతవరకూ నిలువరిస్తాడని అర్జెంటీనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించిన ముర్రే... అదే ఫలితాన్ని రియోలో కూడా పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. -
ఉత్సాహంగా టెన్నిస్ కెరటం
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా టెన్నిస్ కెరటం, ప్రపంచ ఐదో నెంబర్ ఆటగాడైన జువాన్ మార్టిన్ డెల్ పోట్రో (27) తన మణి కట్టు గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా డెల్ అభిమానులతో పంచుకున్నాడు. మంచి స్నేహితులు, పాజిటివ్ ఆలోచనలతో టెన్నిస్ ప్రాక్టీస్ చేయడం ఎపుడూ మంచిదే అంటూ ట్విట్ చేశాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టానంటూ, అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తున్న ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2012 లండన్ ఒలంపిక్స్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ గెల్చుకున్న తొలి అర్జెంటీనా టెన్సిస్ క్రీడాకారుడు డెల్ మళ్లీ తను టెన్సిస్ బరిలోకి దిగేందుకు రెడీ అంటూ సానుకూల సంకేతాలను అందించాడు. 2005, 2008 లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించిన డెల్ ..ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌ను వరుసగా నాలుగు సార్లు గెల్చుకుని రికార్డు సృష్టించాడు. అనంతరం 2010లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి ప్రపంచ అయిదవ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో మొదటిసారి ఎడమ చేతి మణికట్టు గాయంతో బాధపడ్డాడు. తరువాత 2012లో లండన్ ఒలంపిక్స్ లో సెర్బియన్ వండర్ నోవాక్ జోకోవిచ్ ను ఓడించి, విజేత గా నిలిచాడు. కాగా వరుస గాయాలతో గత పద్దెనిమిది నెలలుగా మూడు ఆపరేషన్ల తరువాత కోలుకొని డెల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. భుజం గాయం బాధిస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా కొన్ని టోర్నీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.