'పసిడి'పై డెల్ పాట్రో గురి!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో అద్భుతమైన ఫామ్తో చెలరేగిపోతున్న అర్జెంటీనా స్టార్ టెన్నిస్ ఆటగాడు పసిడిపై గురి పెట్టాడు. శనివారం అర్థరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో డెల్ పాట్రో సంచలన విజయం నమోదు చేసి ఫైనల్కు చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా స్పెయిన్ బుల్, మూడో సీడ్ రఫెల్ నాదల్ ను బోల్తా కొట్టించిన డెల్ పాట్రో తుది పోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీగా మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్లో పాట్రో 5-7, 6-4, 7-6(7/5) తేడాతో నాదల్ను ఓడించి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు.
తొలి సెట్ను కోల్పోయిన పాట్రో.. ఆ తరువాత ఏమాత్రం బెదరకుండా నాదల్ను ఇంటికి పంపించాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోరులో డెల్ పాట్రో ఒత్తిడిని జయించి ఫైనల్ కు చేరగా, నాదల్ మాత్రం తీవ్రమైన ఒత్తిడిలోనై ఓటమి పాలయ్యాడు. ప్రధానంగా టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్ లో డెల్ పాట్రో అద్భుతమైన ఏస్ లతో ఆకట్టుకున్నాడు.
దీంతో రెండో ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాలన్న నాదల్ ఆశలకు బ్రేక్ పడింది.2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు మాత్రం గాయంతో దూరమయ్యాడు.కాగా, రియో ద్వారా రెండో సింగిల్స్ ఒలింపిక్ పసిడిని సాధించి మరోసారి పూర్వవైభవాన్ని చాటుకోవాలని నాదల్ యత్నించినా, డెల్ పాట్రో లాంటి పటిష్టమైన ప్రత్యర్థి ముందు తలవంచక తప్పలేదు.
రియో ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్ను ఇంటికి పంపిన డెల్ పాట్రో మరోసారి అదే తరహా ఆట తీరుతో నాదల్కు చుక్కలు చూపించాడు. దీంతో మరో సెమీ ఫైనల్లో జపాన్ ఆటగాడు నిషాకోరిపై విజయం సాధించిన ఆండీ ముర్రేతో అమీతుమీ తేల్చుకునేందుకు పాట్రో సిద్ధమయ్యాడు. అయితే గత నెల్లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలిచి మంచి ఊపుమీద ఉన్న ముర్రేను పాట్రో ఎంతవరకూ నిలువరిస్తాడని అర్జెంటీనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించిన ముర్రే... అదే ఫలితాన్ని రియోలో కూడా పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.