ఉత్సాహంగా టెన్నిస్ కెరటం
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా టెన్నిస్ కెరటం, ప్రపంచ ఐదో నెంబర్ ఆటగాడైన జువాన్ మార్టిన్ డెల్ పోట్రో (27) తన మణి కట్టు గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా డెల్ అభిమానులతో పంచుకున్నాడు. మంచి స్నేహితులు, పాజిటివ్ ఆలోచనలతో టెన్నిస్ ప్రాక్టీస్ చేయడం ఎపుడూ మంచిదే అంటూ ట్విట్ చేశాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టానంటూ, అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తున్న ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2012 లండన్ ఒలంపిక్స్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ గెల్చుకున్న తొలి అర్జెంటీనా టెన్సిస్ క్రీడాకారుడు డెల్ మళ్లీ తను టెన్సిస్ బరిలోకి దిగేందుకు రెడీ అంటూ సానుకూల సంకేతాలను అందించాడు.
2005, 2008 లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించిన డెల్ ..ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌ను వరుసగా నాలుగు సార్లు గెల్చుకుని రికార్డు సృష్టించాడు. అనంతరం 2010లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి ప్రపంచ అయిదవ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో మొదటిసారి ఎడమ చేతి మణికట్టు గాయంతో బాధపడ్డాడు. తరువాత 2012లో లండన్ ఒలంపిక్స్ లో సెర్బియన్ వండర్ నోవాక్ జోకోవిచ్ ను ఓడించి, విజేత గా నిలిచాడు. కాగా వరుస గాయాలతో గత పద్దెనిమిది నెలలుగా మూడు ఆపరేషన్ల తరువాత కోలుకొని డెల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. భుజం గాయం బాధిస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా కొన్ని టోర్నీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.