social networks
-
సోషల్ మీడియాలో తప్పులతో ఉద్యోగాలకు ఎసరు
సోషల్ మీడియాను ఆస్వాదిస్తూ నేటి యువతరం గంటల తరబడి అందులో లీనమైపోతోంది. తమ భావాలను వ్యక్తీకరిస్తూ ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు. స్నేహితులతో చాటింగ్, తమ కామెంట్స్ పోస్టుచేయడంతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ పోస్టింగ్స్ వల్ల మీ ఉద్యోగానికే ఎసరు రావొచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్స్ మీకు ఉద్యోగం రాకుండా ప్రతిబంధకంగా మారొచ్చు... తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన సోషల్ రిక్రూటింగ్ సర్వే తాజా ఎడిషన్‌లో దీనికి సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవలి కాలంలో అమెరికా లాంటి దేశాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీలు, రిక్రూటర్లు అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. వృత్తి నిపుణుల కోసం అన్వేషణలో అవి సోషల్ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించాయని ఆ సర్వేలో వెల్లడైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో రిక్రూటర్స్ 73 శాతం సోషల్ రిక్రూటింగ్ పైన, 63 శాతం రిఫరల్స్తో, 51 శాతం మొబైల్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ, ఆపరేషన్స్, సేల్స్ రంగాల్లో అత్యంత ప్రతిభావంతుల కోసం డిమాండ్ ఉన్నట్టు తేలింది. సోషల్ నెట్వర్క్ ఒక్కటే రిక్రూట్మెంట్కు ప్రామాణికం కాకపోయినా, ఉద్యోగ నియామకాల్లో రిక్రూట్ చేసుకునేవారు అభ్యర్థుల గురించి తెలుసుకోడానికి సోషల్‌మీడియా ప్రొఫైల్స్ ప్రధాన సోర్స్‌గా పనికొస్తోందని తేలింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్న విషయాలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టు తేలింది. ఉద్యోగ నియామకాల్లో ఇండస్ట్రీస్‌కు సోషల్ మీడియా (లింక్డిన్ 94 శాతం, ఫేస్ బుక్ 66 శాతం, ట్విట్టర్ 52 శాతం) ప్రధాన సాధనంగా మారింది. అభ్యర్థులను సంప్రదించడం, సరైన అభ్యర్థులను వెతుక్కోవడం, ఇంటర్వ్యూల కన్నా ముందుగానే ఎంపికచేసిన వారిని ఫిల్టర్ చేయడం (లింక్డిన్), ఎంప్లాయర్ బ్రాండ్, రిఫర్రల్స్, ప్రీ ఇంటర్వ్యూ, పోస్ట్ ఇంటర్వూల ద్వారా వడపోత కార్యక్రమం (ఫేస్ బుక్), గతంలో చేసిన ఉద్యోగాలు, ఇంటర్వ్యూల కన్నా ముందే వడపోత కార్యక్రమం (ట్విట్టర్) వంటి వాటన్నింటికీ రిక్రూటర్స్ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నట్టు తేలింది. ఇలా దాదాపు 73 శాతం ఇలాంటివాటి ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్టుగా రిక్రూటర్స్ చెప్పినట్టు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ రకంగా చేయడంలోనూ, అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ఏజెన్సీలు 93 శాతం మేరకు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను రివ్యూ చేస్తున్నట్టు ఆ సర్వేలో బయటపడింది. అడ్డగోలు పోస్టింగ్స్‌తో అసలుకే ఎసరు జాబ్స్ రిక్రూట్ మెంట్స్‌లో రిక్రూటర్లు ప్రధానంగా సోషల్ మీడియాపై ఆధారపడుతున్న నేపథ్యంలో నిపుణులైన యువతీ యువకులు సోషల్ మీడియా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు సంబంధిన విషయాలు, చట్ట వ్యతిరేక చర్యలు, శృంగారానికి సంబంధించిన పోస్టింగ్స్ వంటివి తెలిసీ తెలియక చేసినా మీకు ఉద్యోగం రానట్టే. ఇలాంటి పోస్టింగ్స్‌పై రిక్రూటర్స్ తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించి స్నేహితులతో ఎలాంటి పోస్టింగ్ చేసినా అది మీకు ప్రతిబంధకం కావొచ్చు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని పోస్టింగ్స్ చేయొచ్చు. కానీ రిక్రూట్ చేసుకునే వారిలో 83 శాతం మేరకు వాటిని వ్యతిరేక దృష్టితోనే చూస్తున్నారు. ఆ తర్వాత సెక్సువల్ పోస్టింగ్స్ విషయంలోనూ 70 శాతం రిక్రూటర్స్ వ్యతిరేకంగానే పరిగణిస్తున్నారు. కేవలం ఒక శాతం మాత్రమే ఆ విషయాలను పాజిటివ్ కోణంలో చూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. అశ్లీలదృశ్యాలను పోస్టు చేయడం, వాటిపై కామెంట్స్ చేయడం అభ్యర్థుల పట్ల నెగెటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో తుపాకీ సంస్కృతి, మద్యం వంటి విషయాల్లో పోస్టింగ్స్ కూడా 44 శాతం మంది రిక్రూటర్స్‌కు నచ్చడం లేదని వెల్లడైంది. ఇంకో విచిత్రమేమంటే... పోస్టింగ్స్‌లో దొర్లుతున్న అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అభ్యర్థులు ఇలాంటి పొరపాట్లు చేయడం దాదాపు 66 శాతం మంది రిక్రూట్మెంట్ మేనేజర్లకు నచ్చడం లేదు. రాజకీయ పరమైన కామెంట్స్ గానీ, రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాలకు సంబంధించిన పోస్టింగ్స్ విషయాల్లో గానీ రిక్రూటర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తేలింది. 1 నుంచి 6 శాతం రిక్రూటర్లు మాత్రమే రాజకీయ సంబంధాలను కూడా సందర్భాన్ని బట్టి నెగెటివ్‌గానే పరిగణిస్తున్నట్టు తేలింది. పాజిటివ్ అంశాలూ ఉన్నాయి... ఫేస్బుక్, లింక్డిన్లో మీ ప్రొఫైల్ మార్చుతున్నప్పుడు, లేదా అప్డేట్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛారిటీ పనులు, స్వచ్ఛందంగా మీరేదైనా విరాళాలు ఇచ్చి ఉంటే ... అలాంటి విషయాలను సానుకూలంగా పరిగణిస్తున్నట్టు 65 శాతం రిక్రూటర్స్ వెల్లడించారు. మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్, మ్యూచువల్ కనెక్షన్స్, సాంస్కృతికపరమైన అంశాలన్నీ మీకు అనుకూలంగా నిలుస్తున్నాయి. వివిధ రకాల సోషల్ మీడియాలు నిపుణుల వెతుకులాటలో రిక్రూటర్లు ప్రధానంగా లింక్డిన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. 79 శాతం లింక్డిన్‌పై (బయోడాటా) ఆధారపడుతుండగా, 26 శాతం ఫేస్బుక్ పైన, 14 శాతం ట్విట్టర్ పైన ఆధారపడుతున్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఎంత కాలం సర్వీసు చేశారు, మీకు తగిన ఉద్యోగం చేశారా, కష్టపడే మనస్తత్వం ఉందా, రాయడంలో గానీ, డిజైన్‌లో గాని ఉన్న స్కిల్స్ వంటి వాటి కోసం రిక్రూటర్స్ మీ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. వివిధ రకాల ఇండస్ట్రీకి చెందిన దాదాపు 2 వేల మంది హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్స్‌తో ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించినట్టు జాబ్ విటే ఇటీవల ప్రకటించింది. అందువల్ల ఉద్యోగాల వేటలో ఉన్న నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ న్యూట్రల్ నెగెటివ్ అశ్లీల దృశ్యాలు, కామెంట్స్ 5 22 63 అక్షర దోషాలు 3 24 66 డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక రిఫరెన్స్ 2 7 83 సెక్స్ కు సంబంధించిన పోస్టింగ్స్ 1 17 70 రాజకీయ పార్టీల అనుబంధం 2 69 17 విరాళాలు, స్వచ్ఛంద సేవ 65 25 2 మద్యం 2 43 44 గన్స్, మారణాయుధాలు... 2 32 51 -
పొద్దున లేస్తే అదే పని
న్యూఢిల్లీ: గతంలో పొద్దున్నే లేవగానే హా... అంటూ కళ్లు తుడుముకునే వారంతా ఇప్పుడు మాత్రం నిద్రనుంచి మేల్కొంటుండగా కళ్లు తెరవకుండానే ముందు వారి చేతులు ముందు స్మార్ట్ ఫోన్‌ను వెతుకుతున్నాయట. అలా తీసుకునేది టైం ఎంతయిందో చూసుకోవడానికి కాదండోయ్.. వెంటనే డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పడిపోతుంటారట. డెలాయిట్ లోని ఓ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఈ మేరకు అధ్యయనం చేసి దాని వివరాలు తెలిపింది. డెలాయిట్ మొబైల్ వినియోగదారుల సర్వే 2015 ప్రకారం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 78 శాతం మంది కూడా నిద్ర నుంచి మేల్కొండగా, మేల్కొన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల్లోనే కచ్చితంగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తారని తెలిపింది. మరో 52శాతంమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఓ ఐదు నిమిషాలపాటు అందులో విహరిస్తారని తెలిపింది. ఇలా వారు చెక్ చేసే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ బాక్సెస్, మెయిల్స్ వాటిని ఎక్కువగా తనిఖీ చేస్తుంటారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. -
ఉత్సాహంగా టెన్నిస్ కెరటం
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనా టెన్నిస్ కెరటం, ప్రపంచ ఐదో నెంబర్ ఆటగాడైన జువాన్ మార్టిన్ డెల్ పోట్రో (27) తన మణి కట్టు గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్నాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా డెల్ అభిమానులతో పంచుకున్నాడు. మంచి స్నేహితులు, పాజిటివ్ ఆలోచనలతో టెన్నిస్ ప్రాక్టీస్ చేయడం ఎపుడూ మంచిదే అంటూ ట్విట్ చేశాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టానంటూ, అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తున్న ఫోటోలను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2012 లండన్ ఒలంపిక్స్ క్రీడల్లో బ్రాంజ్ మెడల్ గెల్చుకున్న తొలి అర్జెంటీనా టెన్సిస్ క్రీడాకారుడు డెల్ మళ్లీ తను టెన్సిస్ బరిలోకి దిగేందుకు రెడీ అంటూ సానుకూల సంకేతాలను అందించాడు. 2005, 2008 లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించిన డెల్ ..ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌ను వరుసగా నాలుగు సార్లు గెల్చుకుని రికార్డు సృష్టించాడు. అనంతరం 2010లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించి ప్రపంచ అయిదవ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో మొదటిసారి ఎడమ చేతి మణికట్టు గాయంతో బాధపడ్డాడు. తరువాత 2012లో లండన్ ఒలంపిక్స్ లో సెర్బియన్ వండర్ నోవాక్ జోకోవిచ్ ను ఓడించి, విజేత గా నిలిచాడు. కాగా వరుస గాయాలతో గత పద్దెనిమిది నెలలుగా మూడు ఆపరేషన్ల తరువాత కోలుకొని డెల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. భుజం గాయం బాధిస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా కొన్ని టోర్నీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
నా పేరుతో నకిలీ ఫేస్బుక్
చెన్నై : నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారని నటుడు, సమత్తువ కచ్చి నేత, శాసనసభ్యుడు శరత్‌కుమార్ ఆరోపించారు. దీని గురించి ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రెండు రోజు క్రితం తన పేరుతో ఎవరో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించారన్నారు. ఇది తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. వారెవరైనా సరే వెంటనే తొలగించాలన్నారు. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అదే విధంగా తాను నిత్యం రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తానని తెలిపారు. శరీరం దృఢంగా ఉంటేనే మనసు, చర్యలు బాగుంటాయని పేర్కొన్నారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసవ్వకూడదని అందరికి హితవు చెబుతుంటానని అలాంటిది వృత్తిపరమైన, చిత్రం నుంచి తొలగించిన ఒక ఫొటోను సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేస్తూ తనకు కళంకం ఆపాదించే చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపై తన ఫొటో గానీ, తనకు సంబందించిన న్యూస్‌ను గానీ ఏ సోషల్ నెట్‌వర్క్స్‌లో ప్రసారం చేయరాదని మనవి చేస్తున్నానని శరత్‌కుమార్ పేర్కొన్నారు. -
మీడియాను పిలవొద్దు
ప్రసార మాధ్యమాలు పెరుగుతున్నాయి. పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ నెట్వర్క్స్ అంటూ వాటి ప్రభావం అధికం అవుతుండడంతో ఎప్పుడు? ఎక్కడ? ఎలాంటి సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఇక హీరో, హీరోయిన్ల విషయాలైతే వారికి సంబంధించిన చిత్రాల వివరాల కంటే వ్యక్తిగత విషయాలే ప్రచారంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. దీంతో ముఖ్యంగా హీరోయిన్లు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. ఈ మధ్య నటి హన్సిక, జయంరవితో నటించిన రోమియో జూలియట్ చిత్ర విలేకరుల సమావేశానికి ఆమెను ఆహ్వానిస్తే రానని చెప్పారట. కారణం శింబుతో లవ్ ఫెయిల్యూర్, ఇంటర్నెట్లో హల్చల్ చేసిన నగ్న దృశ్యాలు ఆల్బమ్‌ల గురించి ప్రశ్నలు సంధిస్తారని వివరించారట. అలాంటి ప్రశ్నలు తలెత్తకుండా చూసుకుంటామని దర్శక నిర్మాతలు హామీ ఇవ్వడంతో హన్సిక ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నట్లుగానే ఆ కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని విలేకరిని రిక్వెస్ట్ చేశారు. కాగా నేను షూటింగ్లో ఉన్నప్పుడు మీడియాను పిలవొద్దు అంటూ నిర్మాతలకు ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ అమ్మడి వ్యవహారం చూస్తే జీవాతో నటిస్తున్న తాజా చిత్రం తిరునాళ్. ఈ చిత్ర షూటింగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్ర కవరేజ్ కోసం చెన్నై నుంచి విలేకరులను తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతల వర్గం భావించింది. అందుకు జీవా, నయనతార కూడా ఓకే చెప్పారు. అయితే ఆ తరువాత నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివతో ప్రేమాయణం అంటూ ప్రచారం జోరందుకోవడం, వారిద్దరు దిగిన సెల్ఫీ ఫొటో సోషల్ నెట్‌వర్క్సులో హల్చల్ చేయడంతో షాక్ అయిన నయనతార ఇప్పుడు మీడియా వస్తే ఆ విషయాలు గురించే గుచ్చి గుచ్చి అడుగుతారు. చిత్ర వివరాలు గురించి పట్టించుకోరంటూ నిర్మాతలకు నచ్చచెప్పి తాను సెట్లో ఉండగా విలేకరులను తీసుకురావద్దు అంటూ అడ్డుకట్ట వేశార ట. ముందు జాగ్రత్త అంటే ఇదేనేమో. -
మనోరమ క్షేమం
సీనియర్ నటి మనోరమ కన్ను మూసినట్టు ఆదివారం కొన్ని షోషల్ నెట్ వర్క్స్‌లో ప్రచారం సాగింది. దీంతో సినీ వర్గాలు, మనోరమ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా మంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అవన్నీ అసత్య ప్రచారంగా తేలింది. వెయ్యి చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నటించి చరిత్రకెక్కిన మనోరమ లాంటి వారిపై ఇలాంటి వదంతులు ప్రచారం కావడం బాధాకరంగా సినీ వర్గాలుపేర్కొంటున్నాయి. మనోరమ కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, అసత్య ప్రచారాన్ని దయ చేసి చేయ వద్దని విన్నవించారు. గత కొంత కాలంగా మనోరమ అనారోగ్యం బారిన పడటం, ఆస్పత్రిలో చేరడం మళ్లీ డిశ్చార్జ్ కావడం తెలిసిందే. -
అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేయొద్దు!
ఫేస్బుక్ లో అదేపనిగా సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారా. అయితే ఈ అలవాటు మానుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సలహాయిస్తున్నారు. సామాజిక సంబంధాల వెబ్సైట్లలో ఎక్కువగా సెల్ఫీలు పోస్ట్ చేసే వారికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు దూరమవుతారని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనుషుల మధ్య బంధాలను 'సోషల్ సెల్ఫీలు' దెబ్బ తీస్తాయని పరిశోధనలో రుజువైందని అంటున్నారు. సెల్ఫీలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయడాన్ని సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇష్టపడరని బర్మింగ్‌హామ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు డేవిడ్ హాగ్టన్ తెలిపారు. సెల్ఫీలను ఒకొకరు ఒక్కొక్క కోణంలో చూసి కామెంట్ చేస్తారని దీంతో అభిప్రాయబేధాలు తలెత్తే అవకాశముందని వివరించారు. ఫేస్బుక్లో సెల్ఫీలు పోస్ట్ చేసే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. -
సోషల్ నెట్ వర్క్ సైట్లలో ఎన్నికల ఫలితాలు
-
మారిన ప్రచారం తీరు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలుపొందాలంటే ప్రచారం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలనే అభిప్రాయంతో అన్ని రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక వెబ్సైట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో పార్టీలన్నీ తమ వ్యూహాలను ఒక్కసారిగా మార్చుకున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో ప్రజలు సామాజిక వెబ్సైట్లకు ఎక్కువగా అలవాటు పడడంతో వాటిద్వారా ప్రచారం చేసి నగర ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం ప్రతి పార్టీ ప్రత్యేక ‘సైబర్ సెల్’ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తలకు, నేతలుకు ‘సోషల్ మీడియా వర్క్‌షాప్’లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. మొబైల్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వాటిద్వారా కూడా ప్రచారం చేస్తున్నాయి. ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం పట్టణ ఓటర్లలో నాలుగుశాతం మంది సైబర్ ప్రచారం ద్వారానే ప్రభావితమై ఓటు వేస్తున్నట్లు తేలింది. రాజకీయ పార్టీల ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు మరింత సులువు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఖర్చు తక్కువ కావడం, తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు తమ అభిప్రాయాన్ని చేరవేసే అవకాశం ఉండడంతో దీనిపైనే రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయన్నారు. ఈ విషయమై జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన మునీశ్ రాథోడ్ అనే విద్యార్థి మాట్లాడుతూ... ‘యువశక్తిని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉంది. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పిలుపునిచ్చినప్పుడు సామాజిక వెబ్సైట్ల ద్వారా యువత ఏకమైన తీరు దేశాన్నే కుదిపేసింది. అలాగే డిసెంబర్ 16న జరిగిన దారుణ సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడింది. యువశక్తిని ఏకం చేసి, నేతలను, అధికారులను పరుగులు పెట్టించింది. అటువంటి సామాజిక మాధ్యమం ద్వారానే యువకుల వద్దకు వెళ్లాలని రాజకీయ పార్టీలు ఆలోచించడం సరైన నిర్ణయమే. ఇది తప్పుకుండా సానుకూల ఫలితాలను ఇస్తుంద’న్నారు.