మారిన ప్రచారం తీరు
Published Sat, Oct 19 2013 11:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలుపొందాలంటే ప్రచారం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలనే అభిప్రాయంతో అన్ని రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక వెబ్‌సైట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో పార్టీలన్నీ తమ వ్యూహాలను ఒక్కసారిగా మార్చుకున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో ప్రజలు సామాజిక వెబ్‌సైట్లకు ఎక్కువగా అలవాటు పడడంతో వాటిద్వారా ప్రచారం చేసి నగర ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం ప్రతి పార్టీ ప్రత్యేక ‘సైబర్ సెల్’ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తలకు, నేతలుకు ‘సోషల్ మీడియా వర్క్‌షాప్’లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి.
మొబైల్ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వాటిద్వారా కూడా ప్రచారం చేస్తున్నాయి. ‘ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం పట్టణ ఓటర్లలో నాలుగుశాతం మంది సైబర్ ప్రచారం ద్వారానే ప్రభావితమై ఓటు వేస్తున్నట్లు తేలింది. రాజకీయ పార్టీల ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు మరింత సులువు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఖర్చు తక్కువ కావడం, తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు తమ అభిప్రాయాన్ని చేరవేసే అవకాశం ఉండడంతో దీనిపైనే రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయన్నారు.
ఈ విషయమై జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చెందిన మునీశ్ రాథోడ్ అనే విద్యార్థి మాట్లాడుతూ... ‘యువశక్తిని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉంది. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పిలుపునిచ్చినప్పుడు సామాజిక వెబ్‌సైట్ల ద్వారా యువత ఏకమైన తీరు దేశాన్నే కుదిపేసింది. అలాగే డిసెంబర్ 16న జరిగిన దారుణ సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడింది. యువశక్తిని ఏకం చేసి, నేతలను, అధికారులను పరుగులు పెట్టించింది. అటువంటి సామాజిక మాధ్యమం ద్వారానే యువకుల వద్దకు వెళ్లాలని రాజకీయ పార్టీలు ఆలోచించడం సరైన నిర్ణయమే. ఇది తప్పుకుండా సానుకూల ఫలితాలను ఇస్తుంద’న్నారు.
Advertisement