సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమం గురించి.. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక్కరోజు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను లాగ్ అవుట్ చేసి.. దూరంగా ఉండాలని కోరుతున్నారు. పనిలో పనిగా సంస్కరణల దిశగా అడుగువేయాలని ఫేస్‌బుక్‌ను కోరుతూనే.. కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
బాయ్‌కాట్ ఫేస్‌బుక్ ట్రెండ్. 2021 నవంబర్ 10న ఒక్కరోజు ఫేస్‌బుక్, దాని అనుబంధ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను సైతం లాగ్ అవుట్ చేయాలని, ఆ ఒక్కరోజు వాటిని దూరంగా ఉండాలని యూజర్లను కోరుతున్నాయి సోషల్ జస్టిస్, అంతర్జాతీయ పౌర హక్కుల సంఘాలు. అమెరికా వేదిక నుంచి ఇస్తున్న ఈ పిలుపును.. ప్రపంచం మొత్తం పాటించాలని, ఆ దెబ్బకు సోషల్ మీడియాలో సంస్కరణలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయవి. గతంలో 2018 టైంలో కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్ వెలుగుచూడడంతో.. డిలీట్‌ఫేస్‌బుక్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ నడిచింది. ఇది యూజర్లను తగ్గించకపోయినప్పటికీ.. కంపెనీ స్టాక్ ప్రైస్ అమాంతం పడిపోయేలా చేసింది. ఆతర్వాత పుంజుకోవడానికి ఫేస్‌బుక్‌కు కొన్ని నెలల టైం పట్టింది.
నవంబర్ 10న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను లాగ్ అవుట్ చేయాలని అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు కోరుతున్నాయి. అందుకు వాళ్లు చెప్తున్న కారణాలివే..
► ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం
► రేసిజం, మతపరమైన విద్వేషాలు పెరిగిపోవడానికి ఫేస్‌బుక్ ప్రధాన కారణం
► ఫేక్, తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి.. ఫేస్‌బుక్ ద్వారానే ఎక్కువ జరుగుతోందన్న ఆరోపణ
► యూజర్ భద్రత విషయంలో ఫేస్‌బుక్ పూర్తిగా వైఫల్యం
► కోట్లమంది వాట్సాప్ యూజర్ల డేటాపై నిఘా వేసిందన్న ఆరోపణలు
► ఇక ఫొటో ఫీచర్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పై సైతం నిరసన
► టీనేజర్లపై మానసికంగా దుష్ప్రభావం చూపెడుతుందని తెలిసి కూడా తగిన చర్యలు ఇన్‌స్టాగ్రామ్ చేపట్టకపోవడం
► మార్క్ జుకర్‌బర్గ్‌ను సీఈవో పదవి నుంచి తొలగించాలని..
► అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ ఫర్ కిడ్స్ ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్.
కాపిటోల్‌పై దాడి ఘటనతో సహా.. కొన్ని దేశాల్లో జరిగిన ప్రజావ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కైరోస్ అనే సంస్థ ఈ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. మొన్న బుధవారం నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్.. ఫేస్‌బుక్ ద్వారానే పుంజుకుంటోంది. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ.. వైషమ్యాలను రెచ్చగొడుతోంది. అందుకే నవంబర్ 10న.. 24 గంటలపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగగ్రామ్‌ను లాగ్ అవుట్ చేయాలని కోరుతున్నారు.
ఫేస్‌బుక్ సంపాదన 98.5 శాతం వాటా యాడ్స్‌తోనే వస్తోంది. అందునా యూజర్లకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో.. సెర్చింగ్ డేటా ద్వారా ఆధారంగా నిఘా వేసి.. సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో ప్రదర్శించడం తెలిసిందే. అంటే.. డాటా దుర్వినియోగం ద్వారానే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టం అవుతోందని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మార్పు కోసం ఆ ఒక్కరోజు కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేసి.. ఫేస్‌బుక్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment