ఆక్లాండ్: అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉండటంతో టెస్టులను కాపాడుకోవాలని కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆలోచనగా ఉంది. దీంట్లో భాగంగా తొమ్మిది దేశాలతో టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దీంతో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్‌ను కూడా జరుపుతామని ప్రకటించింది. ఇందులో 13 దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన షెడ్యూల్, పాయింట్ల పద్ధతి, వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఇంతటి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విశ్వవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ ఎంతగానో కృషి చేస్తోంది. ద్వైపాక్షిక క్రికెట్‌లో మార్పులు తేవడం ఇప్పుడే కొత్త కాదు. అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఓ పరిష్కారం లభించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇక ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తారు’ అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు.
భారత్, పాక్ పరిస్థితి ఏమిటి?
ఇదిలావుండగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అనేక కారణాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం లేకపోవడంతో చాలా ఏళ్లుగా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో తప్ప ఇరు దేశాల్లో మాత్రం సిరీస్‌లకు చోటు లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆరు సిరీస్‌లను ఆడాల్సి ఉంటుంది. మరి భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించడం కానీ... పాక్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టే పరిస్థితి కానీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య చాంపియన్‌షిప్ ఎలా జరుగుతుందనే చర్చకు ఐసీసీ తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంది.
► టెస్టు లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో ఒక్కో జట్టు మూడు సిరీస్‌లు స్వదేశంలో... మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరుగుతాయి.
► ప్రతీ జట్టు కనీసం రెండు టెస్టులు... గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో తలపడతాయి.
► ఇక 2020–2021లో జరిగే వన్డే లీగ్‌లో మొత్తం 13 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 12 శాశ్వత సభ్య దేశాలు కాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేత మరో జట్టుగా ఉంటుంది.
► 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టాప్–10 సభ్య దేశాలు పరస్పర అంగీకారం మేరకు నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా జరుపుకోవచ్చు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు తొలిసారిగా ఇందుకు వేదికయ్యే అవకాశాలున్నాయి.
టెస్టు చాంపియన్‌షిప్‌కు శ్రీకారం
Published Sat, Oct 14 2017 12:35 AM | Last Updated on Sat, Oct 14 2017 3:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment