సెహ్వాగ్.. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసే క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ రెండు లైన్ల రెజ్యూమ్ పై విపరీతమైన చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆ రెండు లైన్ల రెజ్యూమ్ ను బీసీసీఐ పెద్దలు చూసి ఆశ్చర్యపోయినట్లు మీడియాలో కథనాలు వెలుగుచూశాయి. ఒక హై ప్రొఫైల్ జాబ్ కు దరఖాస్తు చేసేటప్పుడు సెహ్వాగ్ ప్రవర్తనను కొంతమంది తప్పుబట్టారు కూడా. అయితే అఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సెహ్వాగ్ ఖండించడంతో అది కాస్తా సద్దుమణిగింది. అసలు రెండు లైన్ల రెజ్యూమ్ అనేదిపేరుకే సరిపోతుందని, అటువంటప్పుడు ఆ తరహా రెజ్యూమ్ ను ఎందుకు పంపుతానంటూ ఎదురుప్రశ్నించాడు.
ఇదిలా ఉంచితే, టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే నిష్క్రమణ తరువాత ఆ బాధ్యతలు ఎవరు చెపట్టబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ముందుగా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు రెండోసారి బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించిన తరువాత ఆప్లై చేసిన రవిశాస్త్రిల మధ్యే తీవ్ర పోటీ నెలకొందని విశ్లేషకులు అంచనా. ఒకవైపు బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి నుంచి సెహ్వాగ్ కు మద్దతు లభిస్తుండగా, మరొకవైపు రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ఉంది.
అయితే సెహ్వాగ్ ను ప్రధాన కోచ్ గా ఎంపిక చేస్తే మాత్రం అతను నోరు అదుపులోకి పెట్టుకోకతప్పదని అనిరుధ్ చౌదరి పేర్కొన్నట్లు సమాచారం. 'అవును.. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఒకవేళ అతను కోచ్ గా ఎంపికైతే మాత్రం కొన్ని షరతులు తప్పవు. ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా లేక సిరీస్ కోల్పోయినా మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇలానే ఉంటా అనే రీతిలో ఉంటే కష్టాలు తప్పవు. ఆ విషయంలోనే సెహ్వాగ్ గురించి ఆందోళగా ఉంది' అని అనిరుధ్ చౌదరి అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.