
న్యూఢిల్లీ: ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక తదుపరి ఏం చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పడు దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెరీర్ చివరి దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్, కోచ్‌గానూ వ్యవహరించిన తాను అదృష్టవశాత్తు ఇంకా కోచింగ్‌తోనే కొనసాగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. భారత మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో జరిపిన సంభాషణలో ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా కెరీర్ ముగించాక తదుపరి నాకు చాలా దారులు కనబడ్డాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ మంచి సలహా ఇచ్చారు.
తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు రాహుల్... కొన్నేళ్లు అన్నీ ప్రయత్నించి నీకు ఏది నచ్చుతుందో చివరకు దానికే కట్టుబడి ఉండు అని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. కొన్నాళ్లు వ్యాఖ్యాతగా పనిచేశాను. కానీ ఆటకు దూరంగా వెళ్తున్నట్లు అనిపించింది. అందుకే సంతృప్తినిచ్చే కోచింగ్ వైపే మొగ్గు చూపాను. అండర్–19, భారత ‘ఎ’ జట్లకు కోచ్‌గా అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించా’ అని ‘ది వాల్’ వివరించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వన్డే జట్టుకు తాను సరితూగననే అభద్రతా భావానికి గురయ్యానని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. నిజానికి తాను టెస్టు ప్లేయర్‌ని అని పేర్కొన్న ద్రవిడ్ తన శిక్షణ కూడా టెస్టు క్రికెటర్‌లాగేó సాగిందన్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్ 10889 పరుగులు సాధించాడు.