
న్యూఢిల్లీ: మూడో టెస్టులో కాలుష్యం కారణంగా శ్రీలంక క్రికెటర్లు ముఖానికి మాస్క్‌లతో మైదానంలో దిగడం అన్ని వైపులనుంచి విమర్శలకు తావిచ్చింది. వారు కావాలనే ఇలా చేశారంటూ భారత అభిమానులు, విశ్లేషకులు లంక ఆటగాళ్లపై విరుచుకు పడ్డారు. అయితే ఇప్పుడు ఢిల్లీ కాలుష్యం గురించి స్వయంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇచ్చిన నివేదిక వాస్తవాన్ని చూపించింది. అసలు ఇలాంటి ప్రమాదకర కాలుష్యం ఉన్న స్థితిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడించారంటూ ఐఎంఏ నేరుగా బీసీసీఐని ప్రశ్నిస్తూ లేఖ రాసింది. బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ) అధినేత వినోద్ రాయ్‌కు కూడా ఇదే లేఖను పంపించింది. ‘ఇలాంటి స్థితిలో క్రికెట్ ఆడించడం అంటే ఎంతటి కాలుష్యంలో కూడా క్రికెట్ ఆడవచ్చని అందరికీ తప్పుడు సందేశం ఇచ్చినట్లయింది. పర్టిక్యులేట్ మ్యాటర్ లెవల్స్ 300 దాటినా కూడా మ్యాచ్ సాగిందంటే ఏమనుకోవాలి.
వర్షం సమస్య, వెలుతురు లేమి సమయంలో మ్యాచ్‌లు ఎలా ఆపుతున్నారో ఇక ముందు కాలుష్యం అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది’ అని ఐఎంఏ అధ్యక్షుడు కేకే అగర్వాల్ తన లేఖలో రాశారు. మరో వైపు శ్రీలంక మేనేజర్ అశాంక గురుసిన్హా కూడా ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. ‘మేం డ్రెస్సింగ్ రూమ్‌లో సరిగా ఊపిరి కూడా తీసుకోలేకపోవడంతో డాక్టర్ల సూచనపై ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించాల్సి వచ్చింది. మేం మాత్రమే కాదు భారత జట్టు కూడా ఇలాగే వాడింది’ అని గురుసిన్హా వెల్లడించారు. ఇకపై ఐసీసీ ఎయిర్ క్వాలిటీ మీటర్లను ఉపయోగించాలని కూడా ఆయన సూచించారు. దీనిపై ఐసీసీ స్పందించింది. న్యూఢిల్లీ టెస్టు సమయంలో కాలుష్యానికి సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని, ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో దీనిని చర్చిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment