అపోలో ఆస్పత్రిలో సన్‌రైజర్స్ సందడి
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు అపోలో ఆస్పత్రిలో సందడి చేశారు. క్యాన్సర్ బారిన పడిన చిన్నారులతో సరదాగా గడిపారు. కాసేపు చిన్నారులతో క్రికెట్ ఆడి వారి ముచ్చట తీర్చారు.
ఇక్కడి అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సన్‌రైజర్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, డేల్ స్టెయిన్, డారెన్ స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు పాల్గొన్నారు. వీరంతా కలిసి, క్యాన్సర్ బాధిత చిన్నారుల జట్టుతో రెండు ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఆడారు. పిల్లల ఆట తీరు చూసి క్రికెటర్లు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌ను ఆస్పత్రి సిబ్బందితో పాటు మిగతా క్యాన్సర్ రోగులు ఆసక్తిగా తిలకించారు. క్యూర్ ఫౌండేషన్... అపోలో క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రికెటర్లు క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులను ఊరడించారు. పిచ్చాపాటి కబుర్లతో వారిని ఉల్లాసపరిచారు.
పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ పిల్లల మనోధైర్యం మిగతా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి మనోబలానికి జోహార్లు అని చెప్పారు. ఈ పిల్లల ధైర్యమే క్యాన్సర్‌ను తరిమికొడుతుందని వెల్లడించారు. క్యాన్సర్ బాధిత చిన్నారి కిషన్ మాట్లాడుతూ స్టార్ క్రికెటర్లతో క్రికెట్ ఆడటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. క్రికెట్ బంతిని ఎదుర్కొన్నట్టే క్యాన్సర్‌ను కూడా తామంతా ధైర్యంతో ఎదుర్కొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ పి.విజయ్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.