
‘బ్లూ’ను గెలిపించిన అభిషేక్
ఇండోర్: దాదాపు ఆరు నెలల విరామం తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టినా వీరేంద్ర సెహ్వాగ్ శైలి మాత్రం అదే! ఓపెనర్‌నుంచి మిడిలార్డర్ స్థానానికి మారడం మినహా దూకుడులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన మైదానంలోనే తనదైన ఆటతీరుతో వీరూ (38 బంతుల్లో 59; 9 ఫోర్లు, 1 సిక్స్) అలరించాడు. అయితే మ్యాచ్ ఫలితం మాత్రం ఢిల్లీ జట్టుకు ప్రతికూలంగా వచ్చింది. చాలెంజర్ వన్డే ట్రోఫీలో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఇండియా ‘బ్లూ’ 18 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ‘బ్లూ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. అభిషేక్ నాయర్ (73 బంతుల్లో 91; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ప్రొద్దుటూరి అక్షత్ రెడ్డి (77 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చావ్లా (50 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు), భువనేశ్వర్ (23 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో భాటియా 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. భాటియా (89 బంతుల్లో 65; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చివర్లో నెహ్రా (41 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి భాటియా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు.