ఇంచియాన్: ఇప్పటి వరకూ ఆసియా గేమ్స్ లో దుమ్ము లేపుకుంటూ సెమీస్ కు చేరిన భారత పురుషులు.. రేపటి మ్యాచ్ లో విజయం సాధించి సుదీర్ఘ నిరీక్షణను అధిగమించేందుకు సన్నద్దమవుతున్నారు. భారత్ పురుషలు హాకీలో స్వర్ణం సాధించి 16 ఏళ్ల దాటింది. ఈ తరుణంలో భారత్ ఎలాగైనా తుదిమెట్టుకు చేరాలని భావిస్తోంది. మంగళవారం దక్షిణకొరియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు భారత్ జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ను అధిగమించి ఫైనల్ కు చేరాలని భారత యువ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. 1998 లో ధనరాజ్ పిళ్లె కెప్టెన్సీలో స్వర్ణం సాధించిన అనంతరం భారత్ కు ఇప్పటివరకూ ఆ పతకాన్ని దక్కించుకోలేదు. దీంతో రేపటి పోరులో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించి స్వర్ణం వేటకు సన్నద్ధం కావాలని భారత్ భావిస్తోంది.
ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరి అక్కడ కూడా విజయం సాధిస్తే.. 2016 రియో ఒలింపిక్స్ కు కూడా అర్హత సాధిస్త్తోంది. ఈ రెండు అవకాశాలు భారత్ అదృష్టానికి పరీక్షగా నిలిచాయి. తొలుత రేపటి మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణ కొరియాను ఢీకొనడంపైనే భారత్ ప్రధానంగా దృష్టి పెట్టింది. శనివారం జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో చైనాపై విజయం సాధించి సెమీ ఫైనల్ కు ప్రవేశించిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో పాకిస్థాన్-మలేసియా తలపడనున్నాయి.