తొలి టెస్టులో భారత్ ఘన విజయం
సచిన్ ఫేర్‌వెల్ పార్టీని పాడు చేస్తాం... మాస్టర్‌ను విజయంతో వెళ్లనివ్వం... ఇవీ సిరీస్‌కు ముందు వెస్టిండీస్ ఆటగాళ్ల బీరాలు. కానీ కరీబియన్ ఆటగాళ్లు కోల్‌కతా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. సచిన్ టెండూల్కర్‌ను ఐదు రోజుల పాటు చూడనివ్వకుండా మూడు రోజుల్లోనే పూర్తిగా చేతులెత్తేశారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ధోనిసేన తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగులతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది.
రోహిత్ శర్మకు అండగా నిలిచిన అశ్విన్ కూడా సెంచరీ పూర్తి చేసి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందిస్తే... పేసర్ షమీ తన సంచలన బౌలింగ్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించి ఐదు వికెట్లు తీశాడు. వెరసి... సచిన్ ఫేర్‌వెల్ సిరీస్‌లో తొలి అంకాన్ని భారత్ జట్టు విజయవంతంగా ముగించింది.
కోల్‌కతా: ఉత్కంఠ లేదు... కానీ ఆసక్తికర మలుపులు ఉన్నాయి. ఒత్తిడి లేదు... కానీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండో రోజు లంచ్ సమయానికి కష్టాల్లో ఉన్న భారత్ అనూహ్యంగా పుంజుకున్నా... విజయం దక్కుతుందనే ధీమా లేదు. మూడో రోజు ఉదయం గెలుపునకు ఇరుజట్లు సమాన దూరంలో ఉన్నా... ఒక్క సెషన్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కష్టాల నుంచి ఆధిపత్యం దిశగా వెళ్లిన ధోనిసేనకు అరంగేట్రం హీరో మహ్మద్ షమీ (5/47) తన సూపర్ బౌలింగ్‌తో ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ఈడెన్‌గార్డెన్స్‌లో శుక్రవారం ముగిసిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.
సచిన్ తుది అంకానికి ఘనమైన ఆరంభాన్నిచ్చిన టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 354/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 453 పరుగులకు ఆలౌటైంది. దీంతో 219 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (177) తన ఫామ్‌ను కొనసాగించగా, అశ్విన్ (124) కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. షిల్లింగ్‌ఫోర్డ్‌కు 6, పెరుమాల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 54.1 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. డారెన్ బ్రేవో (37), పావెల్ (36), గేల్ (33), చందర్‌పాల్ (31 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. షమీ 5, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 234 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 23; విజయ్ (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 26; పుజారా (సి) రామ్‌దిన్ (బి) కొట్రీల్ 17; సచిన్ ఎల్బీడబ్ల్యూ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 10; కోహ్లి (సి) పావెల్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 3; రోహిత్ ఎల్బీడబ్ల్యూ (బి) పెరుమాల్ 177; ధోని (సి) రామ్‌దిన్ (బి) బెస్ట్ 42; అశ్విన్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 124; భువనేశ్వర్ (సి) గేల్ (బి) షిల్లింగ్‌ఫోర్డ్ 12; షమీ (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) పెరుమాల్ 1; ఓజా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (129.4 ఓవర్లలో ఆలౌట్) 453.
వికెట్లపతనం: 1-42; 2-57; 3-79; 4-82; 5-83; 6-156; 7-436; 8-444; 9-451; 10-453.
బౌలింగ్: బెస్ట్ 17-0-71-1; కొట్రీల్ 18-3-72-1; షిల్లింగ్‌ఫోర్డ్ 55-9-167-6; పెరుమాల్ 23.4-2-67-2; స్యామీ 12-1-52-0; శామ్యూల్స్ 4-0-12-0.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: గేల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 33; పావెల్ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 36; డారెన్ బ్రేవో (సి) రోహిత్ (బి) అశ్విన్ 37; శామ్యూల్స్ ఎల్బీడబ్ల్యూ (బి) షమీ 4; చందర్‌పాల్ నాటౌట్ 31; రామ్‌దిన్ (సి) విజయ్ (బి) షమీ 1; స్యామీ (బి) షమీ 8; షిల్లింగ్‌ఫోర్డ్ (బి) షమీ 0; పెరుమాల్ రనౌట్ 0; బెస్ట్ (సి) అశ్విన్ (బి) ఓజా 3; కొట్రీల్ (బి) షమీ 5; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (54.1 ఓవర్లలో ఆలౌట్) 168.
వికెట్లపతనం: 1-33; 2-101; 3-110; 4-120; 5-125; 6-152; 7-152; 8-152; 9-159; 10-168
బౌలింగ్: భువనేశ్వర్ 6-1-20-1; షమీ 13.1-0-47-5; అశ్విన్ 19-2-46-3; ఓజా 13-3-27-0; సచిన్ 3-0-18-0.
ఓవరాల్‌గా 9 వికెట్లు తీసిన షమీ... అరంగేట్రంలో మ్యాచ్‌ను గెలిపించిన తొలి పేసర్‌గా రికార్డులకెక్కాడు. మునాఫ్ (7/97) రికార్డును అధిగమించాడు.
రోహిత్, అశ్విన్‌ల ఏడో వికెట్ భాగస్వామ్యం 280 పరుగులు భారత్ తరఫున ఉత్తమం.
టెస్టు అరంగేట్రంలో నరేంద్ర హిర్వాణి (16/136) తర్వాత మెరుగైన గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్ షమీ (9/118).
టెస్టు అరంగేట్రంలో భారత్ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ రోహిత్ (177).
వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ తేడాతో గెలవడం భారత్‌కు ఇది మూడోసారి. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు అంతకంటే ఎక్కువ పడగొట్టిన మూడో భారత బౌలర్ షమీ.
కెరీర్ తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్ షమీ.
ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత క్రికెటర్ అశ్విన్.
తొలి టెస్టులోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న ఐదో భారత క్రికెటర్ రోహిత్.
ధోని కెప్టెన్సీలో భారత్ 25 టెస్టులు గెలిచింది. ఒకే నాయకుడి సారథ్యంలో ఇదే అత్యధికం.
సొంతగడ్డపై భారత్ సాధించిన 71 టెస్టు విజయాల్లో సచిన్‌కు భాగస్వామ్యం ఉంది.
సెషన్-1 ఓవర్లు: 27.4 పరుగులు: 99 వికెట్లు: 4
బెస్ట్ బౌలింగ్‌లో చెరో ఫోర్ కొట్టిన అశ్విన్, రోహిత్‌లు క్రమంగా క్రీజులో కుదురుకున్నారు. షిల్లింగ్‌ఫోర్డ్ ఓవర్‌లో ఆచితూచి ఆడిన అశ్విన్.. తర్వాత బెస్ట్ ఓవర్‌లో బంతిని స్వీపర్ కవర్ వైపు మళ్లించి కెరీర్‌లో రెండో సెంచరీ (159 బంతుల్లో)ని పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ అడపాదడపా బౌండరీలు కొట్టినా... ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌పైనే దృష్టిపెట్టారు. ఈ క్రమంలో 150 పరుగుల మార్కును దాటిన అతన్ని పెరుమాల్ అవుట్ చేశాడు. గింగరాలు తిరుగుతూ వచ్చిన బంతి రోహిత్ ప్యాడ్‌ను తాకుతూ వెళ్లడంతో అంపైర్ ఎల్బీగా అవుటిచ్చాడు. అయితే రీప్లేలో బంతి వికెట్లకు కాస్త పక్కగా వెళ్లినట్లు స్పష్టమైంది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన భువనేశ్వర్ (12)తో పాటు నిలకడగా ఆడుతున్న అశ్విన్... షిల్లింగ్‌ఫోర్డ్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. తర్వాతి ఓవర్‌లోనే షమీ (1)ని పెరుమాల్ బోల్తా కొట్టించడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఓవరాల్‌గా ఈ సెషన్‌లో భారత్ చివరి నాలుగు వికెట్లను 17 పరుగుల తేడాతో చేజార్చుకుంది.
‘వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోకూడదని అనుకున్నాం. దానికి కట్టుబడి బ్యాటింగ్ చేశాం.ఈ మ్యాచ్ నాకు చిరస్మరణీయమైంది. నేను సాధించిన దానితో సంతృప్తిగా ఉన్నా’
- రోహిత్
‘షమీ తొలి టెస్టులోనే ఆకట్టుకున్నాడు. మంచి నాణ్యమైన బౌలర్ లభించాడు. ముంబై టెస్టు తర్వాత మేమందరం భావోద్వేగ స్థితిలో ఉంటామేమో’
-అశ్విన్
సెషన్-2 ఓవర్లు: 33 పరుగులు: 112 వికెట్లు: 3
లంచ్ తర్వాత భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. షమీ బౌలింగ్‌లో వరుస ఫోర్లు కొట్టిన గేల్ ఊపుమీదున్నట్లు కనిపించినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివరకు భువీ ఓ షార్ట్ బాల్‌తో అతన్ని వెనక్కి పంపాడు.
ఓజా బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ పావెల్... బ్రేవోతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాక పావెల్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన శామ్యూల్స్ కుదురుకోకముందే షమీ బోల్తా కొట్టించాడు. దీంతో విండీస్ 110/3 స్కోరుతో టీ విరామానికి వెళ్లింది.
సెషన్-3 ఓవర్లు: 21.1 పరుగులు: 56 వికెట్లు: 7
టీ తర్వాత అశ్విన్, షమీల జోరుకు కరీబియన్లు చిత్తయ్యారు. నిలకడగా ఆడుతున్న బ్రేవోను కట్టుదిట్టమైన బంతులతో అశ్విన్ దెబ్బతీశాడు. చందర్‌పాల్ నిలబడినా... రెండో ఎండ్‌లో సహచరులు పెవిలియన్ బాటపట్టారు. హైకోర్టు ఎండ్ నుంచి షమీని బౌలింగ్‌కు దించిన ధోని అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఈ యువ పేసర్ వరుస విరామాల్లో రామ్‌దిన్ (1), స్యామీ (8), షిల్లింగ్‌ఫోర్డ్ (0), కొట్రీల్ (5)ల వికెట్లు తీసి షాకిచ్చాడు. చివర్లో పెరుమాల్ (0) రనౌట్ కాగా, బెస్ట్ (3) వికెట్ అశ్విన్‌కు దక్కింది. ఓ దశలో 101/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 67 పరుగుల తేడాతో చివరి 9 వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. ఈ సెషన్‌లో షమీ హవా నడిచింది.