సాక్షి క్రీడా విభాగం
భారత్‌లో క్రికెట్‌ను మినహాయించి మరో ఆట ఏదైనా పక్షం రోజుల పాటు వార్తల్లో నిలవడం మీలో ఎవరికైనా గుర్తుందా! దీనికి లేదు అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు బ్యాడ్మింటన్ అది చేసి చూపించింది. అటు స్టేడియంలో అభిమానులు కావచ్చు ఇటు టీవీ ప్రేక్షకులు కావచ్చు కొత్తగా వచ్చిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌కు బ్రహ్మరథం పట్టారు.
తొలి టోర్నీ కావడంతో అక్కడక్కడా లోపాలు కనిపించినా... మొత్తానికి ఐబీఎల్ అంచనాలను అందుకొని విజయవంతంగా క్రీడా వేదికపై నిలిచింది. వేర్వేరు కారణాలు, సాకులతో ఈ సారి టోర్నీకి దూరమైన అంతర్జాతీయ షట్లర్లు కూడా వచ్చే ఏడాది లీగ్ వైపు చూసేలా చేయడంలో నిర్వాహకులు సఫలమయ్యారు.
ఆరంభ విఘ్నాలను దాటి...
క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ సక్సెస్ తర్వాత దేశంలో ఇతర క్రీడాంశాల్లోనూ లీగ్‌ల పర్వం వేగమందుకుంది. హాకీ, వాలీబాల్, కబడ్డీ... ఇలా వివిధ ఆటల్లో లీగ్ నిర్వహించినా అవి పెద్దగా క్రీడాభిమానులకు చేరువ కాలేదు.
ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ లీగ్ సఫలం అవుతుందా అనే సందేహాలు తలెత్తాయి. బ్యాడ్మింటన్‌కు పర్యాయపదమైన చైనా షట్లర్లు టోర్నీకి దూరం కావడంతో ఐబీఎల్ కళ తప్పుతుందని చాలా మంది భావించారు. ఇలాంటి స్థితిలో ఓ రకంగా సాహసానికి పూనుకున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), స్పోర్టీ సొల్యూషన్స్ ధైర్యంగా అడుగు ముందుకు వేశాయి.
సైనామయం...
నిజాయితీగా చెప్పాలంటే లీగ్ ప్రతిపాదన, సక్సెస్ మొత్తం ఒక ప్లేయర్ చుట్టే పరిభ్రమించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ అద్భుత విజయాలే లీగ్ మార్కెటింగ్‌కు తోడ్పడ్డాయి. ఆమెతో పాటు యువ ఆటగాళ్ల ఇటీవలి ప్రదర్శన కూడా కలిసొచ్చింది. దాంతో ఆరు జట్లకు తగిన సంఖ్యలో చెప్పుకోదగిన ఆటగాళ్లు లభించారు. అందులోనూ భారత ఆటగాళ్లకు తగిన ప్రాతినిధ్యం కూడా లభించింది. లీగ్‌కు ప్రధాన ఆకర్షణ అయిన సైనా నెహ్వాల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ... ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఐబీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది కాబట్టి ఇకపై సైనా క్రికెట్ డ్రెస్‌లో ఫొటో దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం రాకపోవచ్చు.
సరిదిద్దుకుంటారా?
తొలిసారి జరిగిన ఐబీఎల్‌లోనూ లోపాలూ లేకపోలేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరం కావడం, మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు సాగడం, ఆరంభానికి ముందే వేలం మొత్తంపై నిరసనలు... స్పాన్సర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో రాకపోవడం వీటిలో కొన్ని. అయితే ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో పోలిస్తే ఇవి చెప్పుకోదగ్గవి కావు. పైగా తొలిసారి లీగ్ నిర్వహణలో ఈ ఇబ్బందులు సహజమే. వీటిని వచ్చే ఏడాది పరిష్కరించుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు.
అందరూ ఖుష్...
సూపర్ సిరీస్ టోర్నీల విజయాలతో పోల్చినా దక్కని మొత్తం ఐబీఎల్ ఆటగాళ్లకు లభించడం, లీ చోంగ్ వీ, తౌఫీక్ హిదాయత్‌లాంటి దిగ్గజాల నుంచి నేర్చుకునే అవకాశం రావడం కుర్రాళ్లకు మంచి చేసింది.
ఇకపై వివిధ నగరాలకు చెందిన క్రీడాభిమానులు శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్‌లను కూడా సునాయాసంగా గుర్తు పడతారేమో! చైనాతో పాటు ఇతర స్టార్ ఆటగాళ్లు తాము ఐబీఎల్ ఆడకుండా తప్పు చేశామేమో అనే భావనకు లోనైతే లీగ్‌కు ఇంతకంటే మంచి ప్రశంస ఉండదు. మొత్తానికి నిర్వాహకుల మొదలు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అంతా ఒక సక్సెస్‌ఫుల్ టోర్నీలో భాగమయ్యారని నిస్సందేహంగా భావించవచ్చు.
మా లీగ్ ఐపీఎల్ స్థాయికి చేరుతుంది!
ఐబీఎల్ తొలి ఏడాదే ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే భవిష్యత్తులో తాము కూడా ఐపీఎల్ స్థాయికి చేరుకుంటామనే విశ్వాసం ఉంది. ఇప్పటికిప్పుడు ఐబీఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చడం సరైంది కాదు. అయితే లీగ్ ఇంకా ఎదగాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఐపీఎల్‌కు చేరువవుతుందనే నమ్మకముంది. పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్ అద్భుత విజయం సాధించకపోయుంటే మిక్స్‌డ్ డబుల్స్‌లో మా జట్టుకు కష్టమయ్యేది. నిజం చెప్పాలంటే నేను సింగిల్స్ ప్లేయర్‌ను. కిడో-పియా జోడి అద్భుతంగా ఆడుతోంది కాబట్టి మా మ్యాచ్‌పై ఆందోళనతోనే ఉన్నాను. అయితే అజయ్ తొలి గేమ్‌లో ఓడి కూడా మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది సింగిల్స్‌లో మరింత మెరుగైన షట్లర్లు బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగ్‌లో మరింత పోటీ ఉంటుంది.
-సైనా నెహ్వాల్
గర్వంగా ఉంది
‘విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. హాట్‌షాట్స్ టీమ్ అంతా కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. సైనా ముందుండి నడిపించింది. ఈ పక్షం రోజులు చిరస్మరణీయం. ఐబీఎల్ ప్రకటించగానే జట్టు కోసం తొలిసారి నిర్వాహకులను కలిసింది నేనే. విజయం గురించి కాకుండా బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేయాలని నేను భావించాను. ఇప్పుడు లీగ్ సక్సెస్ కావడం కూడా గర్వంగా అనిపిస్తోంది.’
-ప్రసాద్ వి. పొట్లూరి,
హాట్‌షాట్స్ యజమాని
భళా బ్యాడ్మింటన్!
Published Mon, Sep 2 2013 1:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement