ముగిసిన భారత్ పోరు
జియాంగ్‌సు (చైనా):చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరు ముగిసింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 19-21 తేడాతో బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో ఆదిలో సింధు 4-1 తో ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తరువాత థాయ్ లాండ్ క్రీడాకారిణి స్కోరును 4-4 తో సమం చేసింది. ఆపై సింధు 7-4, 13-10 తో మరోసారి ముందుకు దూసుకెళ్లింది. కాగా, తొలి గేమ్ స్కోరు 16-16తో ఇరువురి క్రీడాకారిణులు సమంగా ఉన్న సమయంలో బురానాప్రాసెర్ట్‌సుక్ వరుస పాయింట్లను సాధించి గేమ్ ను దక్కించుకుంది.
అయితే రెండో గేమ్ లో సింధు 11-8తేడాతో పైచేయి సాధించినా మధ్యలో చతికిలబడి వరుస పాయింట్లను చేజార్చుకుంది. రెండో గేమ్ ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లు సాగినా చివరకు బురానాప్రాసెర్ట్‌సుక్నే విజయం వరించింది.
ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారుడు హెచ్ ఎస్ ప్రణయ్ 10-21, 15-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్(చైనా)చేతిలో ఓటమి పాలయ్యాడు. ఏ దశలోనూ ఆకట్టుకోని ప్రణయ్ ఓటమి పాలై టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. మహిళల డబుల్స్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప జోడి 11-21, 14-21 తేడాతో లూ యింగ్-వూ యూ(చైనా) చేతిలో పరాజయం చెందారు.