లంకలో భారత క్రికెటర్ల స్వాతంత్య్ర సంబరాలు
కాండీ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీలంకలోని కాండీలో జరిగిన ఈ వేడుకల్లో జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంబరాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి జాతీయ జెండాను ఆవిష్కరించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ రెండు రోజుల ముందే సోమవారం ముగియడంతో టీమిండియా సభ్యులంతా మిగిలిన సమయాన్ని సరదాగా గడుపుతున్నారు.
ఆఫ్రిది శుభాకాంక్షలు...
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. ‘మన పొరుగున ఎవరు ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు. కాబట్టి ప్రేమాభిమానాలు, శాంతి దిశగా కలిసి పని చేద్దాం.మానవత్వం వర్ధిల్లుగాక’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ కూడా జనగణమన గీతంలోని కొన్ని వాక్యాలకు అనువాదం కూడా రాస్తూ భారతదేశానికి శుభాకాంక్షలు చెప్పాడు.
టాప్–10లోకి రాహుల్
భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి ప్రవేశించాడు. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న అతను 9వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన శిఖర్ ధావన్ పది స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి చేరుకున్నాడు. సస్పెన్షన్‌తో మూడో టెస్టుకు దూర మైన జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌వన్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు.