freedom celebrations
-
గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు
పిల్లలూ! ఇతరులకు మంచి చేయడం మనందరి బాధ్యత. సమాజానికి మన వంతు సహకారం అందించడం మన కర్తవ్యం. అయితే మేము చిన్నపిల్లలం మాకంత శక్తి లేదనో, మేము ఏమీ చేయలేమనో మీరు అనుకోవద్దు. మీరు తల్చుకుంటే ఎన్నో చేయగలరు. మీకున్న దాంట్లోనే అద్భుతాలు సాధించగలరు.మీకో విషయం చెప్తాను వినండి. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మాగాంధీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి, స్వాతంత్య్ర సంగ్రామ నిధికి అందించాలని అంతా అనుకున్నారు. ఆ సమయంలో 12 ఏళ్ల ఓపాప నేను వస్తానంటూ కదిలింది. జోలె పట్టి అందరి దగ్గరికీ వెళ్లి విరాళాలు సేకరించింది.అవన్నీ తీసుకుని వెళ్లి మహాత్మాగాంధీకి అందించింది. ‘మరి నీ విరాళం ఏదీ?‘ అని గాంధీ తాత ఆపాపను అడిగితే తన చేతులకున్న బంగారు గాజులు తీసి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆపాప పెద్దయ్యాక భారత స్వాతంత్య్ర సమరంలోపాల్గొంది. ధైర్యం గల నాయకురాలిగా పేరు పొందింది. ఆమే దుర్గాబాయి దేశ్‌ముఖ్. చూశారా! చిన్న వయసులోనే ఎంత పట్టుదల, దీక్ష చూపిందో ఆమె. మీరూ అలా పట్టుదలతో, దీక్షతో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయాలి. అందరిచేతా మెప్పు పొందాలి. -
లంకలో భారత క్రికెటర్ల స్వాతంత్య్ర సంబరాలు
కాండీ: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీలంకలోని కాండీలో జరిగిన ఈ వేడుకల్లో జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంబరాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి జాతీయ జెండాను ఆవిష్కరించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ రెండు రోజుల ముందే సోమవారం ముగియడంతో టీమిండియా సభ్యులంతా మిగిలిన సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. ఆఫ్రిది శుభాకాంక్షలు... భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది శుభాకాంక్షలు తెలిపాడు. ‘మన పొరుగున ఎవరు ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు. కాబట్టి ప్రేమాభిమానాలు, శాంతి దిశగా కలిసి పని చేద్దాం.మానవత్వం వర్ధిల్లుగాక’ అని ఆఫ్రిది ట్వీట్ చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ కూడా జనగణమన గీతంలోని కొన్ని వాక్యాలకు అనువాదం కూడా రాస్తూ భారతదేశానికి శుభాకాంక్షలు చెప్పాడు. టాప్–10లోకి రాహుల్ భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్–10లోకి ప్రవేశించాడు. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న అతను 9వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన శిఖర్ ధావన్ పది స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి చేరుకున్నాడు. సస్పెన్షన్‌తో మూడో టెస్టుకు దూర మైన జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌వన్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. -
కంచిలిలో ‘జెండా’ పండుగ
కంచిలి: కంచిలిలో అతి పెద్ద జెండా ఆవిష్కరించి జెండా పండుగను స్థానికులు పరిపూర్ణం చేసుకున్నారు. కంచిలికి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని భావించి, స్వాతంత్య్రం వచ్చి 828 నెలలు పూర్తయిన సందర్భంగా 828 అడుగుల జెండాను కాన్పూర్‌లో తయారు చేయించింది. ఈ జెండాను స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేత ఆవిష్కరింపజేశారు. దీన్ని తెలుసుకొన్న జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బిఎం శివప్రసాద్ ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం చెప్పిన విధంగా 272 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి 828 అడుగుల ఈ జెండాను స్థానిక మఠంకంచిలిలో ఆవిష్కరించారు. ఈ జెండాను మెయిన్‌రోడ్డు మీదుగా ఊరేగించి, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల మైదానంలో చుట్టూరా తిప్పి ప్రదర్శించారు. చివరిగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బి.ఎం. శివప్రసాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్ ఆదినారాయణను అభినందించి, ఇది ప్రపంచ రికార్డుగా ధ్రువీకరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ర్యాలీతోపాటు కంచిలి ఆటో యూనియన్ వారు ఆటోలను కూడా ర్యాలీగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక సర్పంచ్ తిలోత్తమనాయక్, ఏఎంసీ అధ్యక్షుడు బంగారు కురయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు తమరాల శోభన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు మురళీమోహన్ పట్నాయక్, మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు నవీన్‌కుమార్ అగర్వాలా, వైఎస్సార్ సీపీ నేత కొత్తకోట శేఖర్, మండల టీడీపీ ప్రచార కార్యదర్శి జగదీష్ పట్నాయక్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అ«ధ్యక్షుడు బుడ్డెపు కామేష్‌రెడ్డి, విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, స్థానిక యువత, ఆటోయూనియన్ సభ్యులు పాల్గొన్నారు.