కంచిలిలో 828 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రదర్శనగా తీసుకెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తదితరులు
కంచిలిలో ‘జెండా’ పండుగ
Published Mon, Aug 15 2016 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
కంచిలి: కంచిలిలో అతి పెద్ద జెండా ఆవిష్కరించి జెండా పండుగను స్థానికులు పరిపూర్ణం చేసుకున్నారు. కంచిలికి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం పంద్రాగస్టు వేడుకలను వినూత్నంగా నిర్వహించాలని భావించి, స్వాతంత్య్రం వచ్చి 828 నెలలు పూర్తయిన సందర్భంగా 828 అడుగుల జెండాను కాన్పూర్‌లో తయారు చేయించింది. ఈ జెండాను స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ చేత ఆవిష్కరింపజేశారు. దీన్ని తెలుసుకొన్న జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బిఎం శివప్రసాద్ ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం చెప్పిన విధంగా 272 మంది విద్యార్థులు, 28 మంది ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి 828 అడుగుల ఈ జెండాను స్థానిక మఠంకంచిలిలో ఆవిష్కరించారు. ఈ జెండాను మెయిన్‌రోడ్డు మీదుగా ఊరేగించి, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల మైదానంలో చుట్టూరా తిప్పి ప్రదర్శించారు. చివరిగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ చీఫ్ కో–ఆర్డినేటర్ బి.ఎం. శివప్రసాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సీహెచ్ ఆదినారాయణను అభినందించి, ఇది ప్రపంచ రికార్డుగా ధ్రువీకరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ర్యాలీతోపాటు కంచిలి ఆటో యూనియన్ వారు ఆటోలను కూడా ర్యాలీగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక సర్పంచ్ తిలోత్తమనాయక్, ఏఎంసీ అధ్యక్షుడు బంగారు కురయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు తమరాల శోభన్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు మురళీమోహన్ పట్నాయక్, మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడు నవీన్‌కుమార్ అగర్వాలా, వైఎస్సార్ సీపీ నేత కొత్తకోట శేఖర్, మండల టీడీపీ ప్రచార కార్యదర్శి జగదీష్ పట్నాయక్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అ«ధ్యక్షుడు బుడ్డెపు కామేష్‌రెడ్డి, విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, స్థానిక యువత, ఆటోయూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement