
భారత్ బోణీ
మన్‌హీమ్ (అమెరికా):భారత మహిళల హాకీ జట్టు తమ అమెరికా పర్యటనలో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఓటమితో పర్యటన ఆరంభించిన భారత జట్టు.. రెండో మ్యాచ్లో ఆకట్టుకుంది. భారత కాలమాన ప్రకారం గురువారం జరిగిన పోరులో భారత్ 2-1 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. భారత జట్టులో ప్రీతి దుబే(45 నిమిషం), లిలిమా మింజ్(55వ నిమిషం)లో గోల్స్ చేసి గెలుపులో సహకరించారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమైనా, రెండో క్వార్టర్ ఆదిలో అమెరికా గోల్ చేసింది.
ఆట 19వ నిమిషంలో అమెరికా క్రీడాకారిణి జిల్ విట్మర్ గోల్ సాధించి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత అమెరికా ఎంత ప్రయత్నించినా భారత రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. ప్రత్యేకంగా రెండో అర్థభాగంలో భారత జట్టు దూకుడుగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. మూడో క్వార్టర్ చివరి నిమిషంలో ప్రీతి గోల్ చేయగా, ఐదు నిమిషాల్లో చివరి క్వార్టర్ ముగుస్తుందనగా మింజ్ రూపంలో భారత్కు మరో గోల్ లభించింది. దీంతో భారత్ విజయం సాధించి తొలి మ్యాచ్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం భారత్ తన తదుపరి మ్యాచ్ ను కెనడాతో తలపడనుంది.