సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ ఈనెల 7 నుంచి జరుగనుంది. నవశక్తి క్రీడా మండల్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 10 పురుషుల, 10 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 3 రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ల కోసం తొలిసారిగా సింథటిక్ మ్యాట్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
గురువారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ పురుషుల జట్టు, రంగారెడ్డి మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర మహిళల, పురుషుల జట్లను ఎంపికచేస్తామని నిర్వాహకులు చెప్పారు. రాష్ట్ర జట్లు ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు గచ్చిబౌలిలో జరిగే జాతీయ కబడ్డీ టోర్నీలో పాల్గొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment