సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 42–40తో నల్లగొండపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లు పోటీపోటీగా తలపడటంతో రంగారెడ్డి తొలి అర్ధభాగంలో 20–18తో స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం అదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 32–26తో మహబూబ్‌నగర్‌పై, నల్లగొండ 52–39తో హైదరాబాద్‌పై గెలిచాయి.
బాలికల టైటిల్‌పోరులో నల్లగొండ 74–35తో నిజామాబాద్‌పై అలవోక విజయాన్ని సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన నల్లగొండ జట్టును నిజామాబాద్ ప్లేయర్లు నిలువరించలేకపోయారు. సెమీస్ మ్యాచ్‌ల్లో నిజామాబాద్ 84–42తో రంగారెడ్డిపై, నల్లగొండ 53–37తో వరంగల్‌పై నెగ్గాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment