kabaddi championship
-
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11: ఎదురులేని పుణెరి పల్టన్
హైదరాబాద్, 4 నవంబర్ 2024 : డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.పల్టన్ వన్‌సైడ్ షో : వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్.. గుజరాత్ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్ జెయింట్స్‌ను ఆలౌట్ చేసిన పుణెరి పల్టన్ 30-9తో వన్‌సైడ్ షో చేసింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్ ఖత్రి, ఆమన్ ట్యాకిల్స్ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్ జెయింట్స్ పూర్తిగా తేలిపోయింది. గుమన్ సింగ్ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.గుజరాత్ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్ జోరు తగ్గలేదు. గుజరాత్ జెయింట్స్ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్ జెయింట్స్ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ 21 పాయింట్లు దక్కించుకుంది. -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం
ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణకొరియాలోని బుసాన్ వేదికగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఓడించింది. కాగా భారత్‌కు ఆసియా కప్ టైటిల్ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. జూన్ 27న ప్రారంభమైన టోర్నీలో మూడురోజుల పాటు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. టాప్-2లో నిలచిన భారత్, ఇరాన్‌లు ఫైనల్లో పోటీపడ్డాయి. భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఇక, ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాల వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. 10వ నిమిషంలో పవన్, ఇనాందార్ సక్సెస్ఫుల్ రైడ్లతో మ్యాచ్ భారత్ వైపునకు తిరిగింది. అప్పటి నుంటి టీమిండియా చెలరేగింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇక భారత కబడ్డీ జట్టుకు తదుపరి ఆసియా గేమ్స్ కీలకంగా ఉంది. సెప్టెంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జవూ వేదికగా ఆసియా గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. చదవండి: #MajidAli: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ -
Volleyball: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త పార్ట్నర్ పల్లవోలో పడోవా
భారతదేశపు ప్రీమియర్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, ఇటలీకి చెందిన సూపర్‌లిగాకు చెందిన ప్రముఖ క్లబ్ పల్లవోలో పడోవాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని వల్ల బ్లాక్ హాక్స్ ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి కోచింగ్ మరియు విస్తృత మౌలిక సదుపాయాలను అందుబాటులోకి రానున్నాయి. అత్యుత్తమ వ్యూహాలు మరియు సాహసోపేత నిర్ణయాలకు పెట్టింది పేరైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్, భారత వాలీబాల్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో మొదటి ప్రపంచ స్థాయి కోచ్‌ను నియమించడం, సంచలనాత్మక షోబిజ్ అనుభవాన్ని సృష్టించడం మరియు అభిమానుల తో అనుబంధం విస్తరించడానికి ప్రముఖులను చేర్చుకుంది బ్లాక్ హాక్స్. 🔥 𝗔 𝗚𝗔𝗠𝗘-𝗖𝗛𝗔𝗡𝗚𝗘𝗥! We are going to usher in a new era in global volleyball, as our partnership with @pallavolopadova will see players and coaches get a chance to learn from some of the best in the world! 🏐#HawkAttack #HyderabadBlackHawks #PallavoloPadova pic.twitter.com/2RHS80kb85 — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 ఇటాలియన్ సూపర్లిగాలో ప్రధాన కేంద్రంగా పల్లవోలో పడోవా ఉంది. అత్యుత్తమ గేమ్ సెన్స్ ద్వారా తన ఆటగాళ్లను శక్తివంతం చేయడంలో ఈ క్లబ్ పేరు గాంచింది. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల రాబోయే రోజుల్లో బ్లాక్ హాక్స్ అనేక మంది ఆటగాళ్లను ఇటలీలోని పడోవాకు శిక్షణ కోసం పంపుతుంది. అలాగే ప్రపంచ స్థాయి కోచింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు యూత్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రూపొందించడంలో బ్లాక్ హాక్స్‌కు పడోవా తమ కోచ్‌లను భారత్‌కు పంపుతుంది. బ్లాక్ హాక్స్ ముఖ్య యజమాని, అభిషేక్ రెడ్డి కంకణాల మాట్లాడుతూ " ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ పూల్ భారతదేశం దగ్గర ఉంది. మన ప్రతిభావంతులైన యువతను ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దడానికి, మాకు అత్యున్నత మౌలిక సదుపాయాలు మరియు అగ్రశ్రేణి కోచింగ్ రెండూ అవసరం. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ మరియు పడోవాతో మా కొత్త భాగస్వామ్యం తో మేము దానిని సాకారం చేస్తున్నాము" అని అన్నారు. 💪🏻𝐀 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂 𝐏𝐀𝐑𝐓𝐍𝐄𝐑𝐒𝐇𝐈𝐏! We are delighted to join hands with @pallavolopadova to bring a new era in global volleyball! 🏐#HawkAttack #HyderabadBlackHawks #RuPayPrimeVolley #AsliVolleyball #PallavoloPadova pic.twitter.com/Io3vgCNDCN — Hyderabad Black Hawks (@blackhawkshyd) May 19, 2023 పడోవా ప్రెసిడెంట్, జియాన్కార్లో బెట్టియో, మాట్లాడుతూ.. "కోచింగ్‌లో 50 సంవత్సరాల అనుభవం ఉంది, మేము మా నైపుణ్యాన్ని ఇక్కడి ఆటగాళ్లకు పంచడానికి ఆసక్తిగా ఉన్నాము, మేము మా క్లబ్‌లు వాలీబాల్ భవిష్యత్తును పునర్నిర్మించగలవనే నమ్మకం తో ఉన్నాము " అని అన్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యొక్క సూత్రప్రాయ స్పాన్సర్ A23 ఈ పార్ట్‌నర్‌షిప్‌పై సంతోషం వ్యక్తం చేసింది. "వాలీబాల్ వంటి నైపుణ్యం కలిగిన ఈవెంట్లను విస్తృత ప్రేక్షకులకు అందించడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మా బ్రాండ్ విజిబిలిటీని మాత్రమే కాకుండా భారతీయ వాలీబాల్ క్రీడాకారులు కు ప్రపంచ వేదికను అందిస్తుంది. మేము ఈ అవకాశం గురించి మరింత ఆసక్తి గా ఉన్నాము " అని అన్నారు. -
గ్యాలరీ స్టాండ్ ఘటన: మురారి వెన్నెముకకు తీవ్ర గాయాలు
సాక్షి, సూర్యాపేట: జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో 30 మందికి, ఇతర, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో 70 మందికి వైద్యం అందిస్తున్నారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న 30మంది క్షతగాత్రుల్లోని 16మందికి వివిధ శస్త్రచికిత్సలు చేశామని, మిగతా వారినీ పరీక్షించి అవసరమైన శస్త్రచికిత్సలు చేయనున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళిధర్‌రెడ్డి తెలిపారు. ఎనిమిది మందికి సీరియస్? సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్యాలరీ కుప్పకూలి 150 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. ఇందులో తీవ్ర గాయాలపాలైన 42 మందిని సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, నార్కట్‌పల్లి కామినేని, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కామినేని ఆస్పత్రిలో సూర్యాపేటకు చెందిన నరేష్ (30), మురారి (45)లకు చికిత్స అందిస్తున్నామని.. వీరిలో మురారికి వెన్నెముకపై బలమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అన్ని పరీక్షలు చేశామని, వాటి ఆధారంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మంచి చికిత్స అందిస్తాం: జగదీశ్‌రెడ్డి ప్రమాద బాధితులకు జరుగుతున్న చికిత్సపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఆయా ఆస్పత్రుల వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు ఎటువంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వారు ఇళ్లకు క్షేమంగా చేరేంత వరకు సహాయ సహకారాలు అందించాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. నిర్వాహకులు, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు గ్యాలరీ ప్రమాదంపై బాధితుల కుటుంబ సభ్యులు సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. కబడ్డీ పోటీల నిర్వాహకులు, గ్యాలరీ నిర్మాణ కాంట్రాక్టర్‌పై 336, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్సాహంగా కొనసాగిన పోటీలు సూర్యాపేటలో రెండో రోజు మంగళవారం 47వ జాతీయ స్థాయి బాలబాలికల జూనియర్ కబడ్డీ పోటీలు కోలాహలంగా సాగాయి. మొదటి రోజు సోమవారం రాత్రి గ్యాలరీ ప్రమాదం అనంతరం పోటీలు ఆలస్యంగా ప్రారంభంకాగా, మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే! -
సూర్యాపేట : కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్ ఫోటోలు
-
కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్.. 100 మందికి గాయాలు
-
కుప్పకూలిన గ్యాలరీ స్టాండ్.. 100 మందికి గాయాలు
సాక్షి, సూర్యాపేట: జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆటను తిలకించే క్రమంలో ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ స్టాండ్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. గ్యాలరీ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అక్కడ కూర్చోవడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాగా 47వ జూనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్ షిప్- 2021ను సోమవారం ప్రారంభించారు. -
భారత్‌పై పాక్ విజయం.. మేము ఏ జట్టునీ పంపలేదు!
లాహోర్: ‘కబడ్డి ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు’.. ఈ మాటలు అన్నది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే సర్కిల్ కబడ్డి ప్రపంచకప్ ఆడటానికి భారత్ నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లలేదట. కానీ ఆదివారం రాత్రి ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 43-41 తేడాతో పాక్ గెలిచిందట. ఈ విషయం తెలిసిన పాక్ ప్రధాని తమ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ వేదికగా తొలిసారి సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్ నిర్వహించారు. అయితే పాక్‌లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి తాము ఎటువంటి జట్టును పంపలేదని, ఎవరైనా వచ్చినా వారు భారత్ పేరు వాడటానికి అనుమతి లేదని పేర్కొంటూ అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ).. పాక్ కబడ్డీ బోర్డుకు అంతకుముందే లేఖ రాసిందట. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) కూడా పాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీకి ఎటువంటి జట్టునూ పంపడంలేదని గత సోమవారమే స్పష్టంచేసింది. కొందరు భారతీయ కబడ్డీ క్రీడాకారులు అనుమతి లేకుండా పాకిస్తాన్ వెళ్లారని, వారే ఈ టోర్నీలో పాల్గొన్నారని కొందరు వాదిస్తున్నారు. మనదేశంలోని పంజాబ్‌లో ఈ సర్కిల్ కబడ్డి ఎక్కువగా ఆడతారు. ఆ జట్టే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు వెళ్లి టోర్నీలో భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. Congratulations to the Pakistan Kabbadi team for winning the Kabbadi World Cup after defeating India. — Imran Khan (@ImranKhanPTI) February 17, 2020 -
‘సాయ్’ జట్టు విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ టోర్నీలో ‘సాయ్’ జట్టు ఘనవిజయం సాధించింది. సరూర్‌నగర్ శాట్స్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సాయ్ 35–28తో ఏఓసీపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఏఓసీ జట్టు కాస్త ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో తొలి అర్ధభా గంలో సాయ్ జట్టు 12–15తో వెనుకబడింది. అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న సాయ్ జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ గెలుపొందింది. విజేత జట్టులో ప్రదీప్ ఆకట్టుకున్నాడు. ఏఓసీ తరఫున శ్రీనాథ్, రాజు మెరుగ్గా రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో హెచ్ఏఎల్ 36–25తో శాట్స్‌పై నెగ్గగా, ఎస్సీఆర్ 42–28తో తెలంగాణ పోస్టల్‌ను ఓడించింది. -
దక్షిణ మధ్య రైల్వే ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు విజయం సాధించింది. సరూర్‌నగర్ శాట్స్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ మధ్య రైల్వే 66–23తో శాట్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి వెనుకబడిన శాట్స్ జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఎస్సీఆర్ 46–7తో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో శాట్స్ జట్టు కాస్త ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది. విజేత జట్టులో మల్లికార్జున, ఎస్కే అమీర్... శాట్స్ తరఫున బాలాజీ, రాఘవేంద్ర వరుసగా ‘బెస్ట్ రైడర్’, ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రా బ్యాంక్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో రైడింగ్‌లో గణేశ్, నిఖిల్, రాజు... డిఫెండింగ్‌లో గౌరీ శంకర్ చెలరేగడంతో తెలంగాణ పోస్టల్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ పోస్టల్ 56–20తో ఆంధ్రా బ్యాంక్‌ను ఓడించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పోస్టల్ 24–10 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. అనంతరం అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను దక్కించుకుంది. మరో మ్యాచ్‌లో టీఎస్ పోలీస్ 22–14తో ఎస్బీఐపై గెలిచింది. రైడింగ్‌లో రాజలింగం, అన్వేశ్ చెలరేగి జట్టుకు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిపెట్టారు. ఎస్బీఐ జట్టులో నర్సింగ్ రావు రాణించాడు. -
చాంపియన్ రంగారెడ్డి జట్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి బాలుర జట్టు చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి 42–40తో నల్లగొండపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లు పోటీపోటీగా తలపడటంతో రంగారెడ్డి తొలి అర్ధభాగంలో 20–18తో స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం అదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజేతగా నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 32–26తో మహబూబ్‌నగర్‌పై, నల్లగొండ 52–39తో హైదరాబాద్‌పై గెలిచాయి. బాలికల టైటిల్‌పోరులో నల్లగొండ 74–35తో నిజామాబాద్‌పై అలవోక విజయాన్ని సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన నల్లగొండ జట్టును నిజామాబాద్ ప్లేయర్లు నిలువరించలేకపోయారు. సెమీస్ మ్యాచ్‌ల్లో నిజామాబాద్ 84–42తో రంగారెడ్డిపై, నల్లగొండ 53–37తో వరంగల్‌పై నెగ్గాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే మహిళల కబడ్డీ టోర్నమెంట్లో ఆతిథ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీ లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఎస్సీఆర్ 37–17తో సెంట్రల్ రైల్వేపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో వెస్ట్రన్ రైల్వే, నార్తర్న్ రైల్వే వరుసగా 3, 4 స్థానాలను సాధించాయి. బహుమతి ప్రధానోత్సవంలో ఎస్సీఆర్ జీఎం వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలిండియా రైల్వే కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వే కబడ్డీ మహిళల టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్స్ వేదికగా బుధవారం జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మహిళల విభాగంలో జరుగుతోన్న ఈ టోర్నీలో రైల్వేస్‌కు చెందిన ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీ శుక్రవారంతో ముగుస్తుంది. ఇందులో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే, ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, నార్తర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ఈస్ట్ రైల్వే, వెస్ట్రన్ రైల్వే జట్లను రెండు ‘పూల్’లుగా విభజించి పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో రాణించి ఆటగాళ్లు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. -
తెలంగాణ కబడ్డీ జట్లకు ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు సన్నాహకంగా తెలంగాణతో జరుగుతోన్న ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్లో దక్షిణ కొరియా జట్లు జోరు కనబరుస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కొరియా జట్ల దూకుడుకు తెలంగాణ జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల విభాగంలో తెలంగాణ 21–47తో కొరియా చేతిలో చిత్తుగా ఓడింది. పర్యాటక జట్టులో డోగ్ గున్లీ, ఎర్న్ తే డోక్ ఆకట్టుకున్నారు. తెలంగాణ జట్టులో లింగమ్ యాదవ్, హనుమంత్ రాణించారు. మహిళల విభాగంలో కొరియా 35–25తో తెలంగాణపై నెగ్గింది. రాష్ట్ర జట్టులో పింకీ రావు, ప్రవళిక, పవిత్ర పోరాడారు. -
అగ్రస్థానంలో అథ్లెటిక్స్ జట్టు
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ చాంపియన్ షిప్లో అథ్లెటిక్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అథ్లెటిక్స్ జట్టు తొలి స్థానాన్ని దక్కించుకోగా... హాకీ, వాలీబాల్ జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో అథ్లెటిక్స్ జట్టు 42–30తో హాకీపై విజయం సాధించింది. రైడర్ గోపాల్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. హాకీ జట్టు తరఫున నవీన్ రాణించాడు. రెండో మ్యాచ్‌లో అథ్లెటిక్స్ జట్టు 36–23తో వాలీబాల్ జట్టుపై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో హాకీ జట్టు 49–45తో వాలీబాల్ జట్టుపై విజయం సాధించింది. వాలీబాల్ టీమ్‌లో రైడర్ నరేశ్ ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో ‘సాయ్’ ఎస్టీసీ 20–19తో ఎన్ఐఎస్ కబడ్డీని ఓడించింది. సాయ్ తరఫున సాయి గౌడ్, అంజి... ఎన్ఐఎస్ జట్టులో సతీశ్, సురేశ్, అలెక్స్ ప్రతిభ కనబరిచారు. -
నేటి నుంచి కబడ్డీ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడలకు సన్నాహకంగా దక్షిణ కొరియా, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్ల మధ్య జరిగే స్నేహపూర్వక కబడ్డీ చాంపియన్‌షిప్ నేటి నుంచి జరుగనుంది. భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య, తెలంగాణ కబడ్డీ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో పురుషులు, మహిళల విభాగంలో 19వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. నేటి సాయంత్రం 5 గంటలకు జరుగనున్న టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సాంకేతిక డైరెక్టర్ ఇ. ప్రసాద్ రావు పాల్గొంటారు. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు–సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. -
బీబీఎంబీ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీసీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్లో భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) జట్టు సత్తా చాటింది. పవర్‌స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో బీబీఎంబీ జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో బీబీఎంబీ 58– 18తో ఎస్‌జేవీఎన్ జట్టుపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పవర్‌గ్రిడ్ జట్టు 48–12తో నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)పై గెలిచింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎస్‌ఆర్‌టీఎస్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్, పవర్‌గ్రిడ్ జీఎం ఎ. రవీందర్, తెలంగా ణ కబడ్డీ సంఘం కార్య దర్శి జగదీశ్వర్ యాదవ్ విజేతలకు పతకాలను అందజేశారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సురీందర్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ ప్లేయర్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులను అందుకున్నాడు. బల్వంత్ రాణా (ఎస్‌జేవీఎన్) ‘బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్’, ప్రతాప్ సింగ్ (బీబీఎంబీ) ‘బెస్ట్ క్యాచర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలను గెలుచుకున్నారు. -
పవర్‌గ్రిడ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ పవర్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (సీపీఎస్‌యూ) కబడ్డీ టోర్నమెంట్లో పవర్‌గ్రిడ్ జట్టు శుభారంభం చేసింది. పవర్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (పీఎస్‌సీబీ) ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తొమ్మిది ‘సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ పవర్ యూనిట్’ జట్లు తలపడుతున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో పవర్‌గ్రిడ్ జట్టు 54–13తో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) జట్టుపై ఘన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (బీబీఎంబీ) 50–14తో మినిస్ట్రీ ఆఫ్ పవర్ (ఎంఓపీ)పై, ఎస్‌జేవీఎన్ జట్టు 46–11తో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)పై, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) 52–21తో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)పై, ఎన్‌హెచ్‌పీసీ 102–20తో ఎంఓపీపై గెలుపొంది ముందంజ వేశాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ (ఎస్‌ఆర్‌టీఎస్–1) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పవర్‌గ్రిడ్ సంస్థ అధికారులు, ‘శాట్స్’ ప్రతినిధులు పాల్గొన్నారు. -
విజేత ఓయూ మహిళా కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి మహిళల కబడ్డీ టోర్నమెంట్లో కోఠి మహిళా యూనివర్సిటీ కాలేజి జట్టు సత్తా చాటింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో యూనివర్సిటీ కాలేజి జట్టు 43–30తో కస్తూర్బా గాంధీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో యూనివర్సిటీ కాలేజి 42–11తో ఆంధ్ర మహిళా సభపై, కస్తూర్బా జట్టు 57–15తో భవన్స్ సైనిక్‌పురి జట్టుపై విజయం సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ జట్టుపై ఆంధ్రమహిళా సభ గెలుపొందింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) డైరెక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కబడ్డీ సాయ్ కోచ్ కె. శ్రీనివాస్ రావు, ఓయూసీడబ్ల్యూ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక రావు, తదితరులు పాల్గొన్నారు. -
రన్నరప్ హైదరాబాద్ జట్లు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లకు నిరాశ ఎదురైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్లు రెండో స్థానంతో సరిపెట్టుకున్నాయి. పురుషుల ఫైనల్లో నల్లగొండ జట్టు 30-29తో హైదరాబాద్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. మహిళల కేటగిరీలోనూ హైదరాబాద్ 25-36తో వరంగల్ చేతిలో పరాజయం పాలైంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కార్యదర్శి కె. జగదీశ్వర్ యాదవ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్లు శుభారంభం చేశాయి. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు కనబరిచాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 53–33తో ఆదిలాబాద్‌పై ఘనవిజయం సాధించింది. పురుషుల విభాగంలోని తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 69–48తో నిజామాబాద్‌పై, రెండో మ్యాచ్‌లో 37–20తో మెదక్‌పై గెలుపొందింది. ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో మెదక్ 51–44తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 60–20తో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 37–19తో కరీంనగర్‌పై, నల్లగొండ 56–28తో మెదక్‌పై, రంగారెడ్డి 46–31తో వరంగల్‌పై, మహబూబ్‌నగర్ 54–27తో నిజామాబాద్‌పై, కరీంనగర్ 61–17తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. -
7 నుంచి అంతర్ జిల్లా కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ ఈనెల 7 నుంచి జరుగనుంది. నవశక్తి క్రీడా మండల్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ మేరకు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలను వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 10 పురుషుల, 10 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో 3 రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌ల కోసం తొలిసారిగా సింథటిక్ మ్యాట్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. గురువారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ పురుషుల జట్టు, రంగారెడ్డి మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో రాష్ట్ర మహిళల, పురుషుల జట్లను ఎంపికచేస్తామని నిర్వాహకులు చెప్పారు. రాష్ట్ర జట్లు ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు గచ్చిబౌలిలో జరిగే జాతీయ కబడ్డీ టోర్నీలో పాల్గొంటాయి. -
భారత్ ‘డబుల్’ ధమాకా
గొర్గాన్ (ఇరాన్): కబడ్డీలో తమకు తిరుగులేదని భారత పురుషుల, మహిళల జట్లు మరోసారి నిరూపించాయి. ఆదివారం ముగిసిన ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్స్‌గా నిలిచాయి. పురుషుల ఫైనల్లో టీమిండియా 36–22తో పాకిస్తాన్‌ను చిత్తు చేయగా... మహిళల జట్టు ఫైనల్లో 42–20తో కొరియాను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో విశేషంగా రాణించిన అజయ్ ఠాకూర్, ప్రదీప్ నర్వాల్ అదే జోరును ఆసియా టోర్నీలోనూ కొనసాగించి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. -
నల్గొండ జట్టు విజయం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో నల్గొండ జట్టు విజయం సాధించింది. జి.పుల్లారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన లీగ్ పోటీల్లో నల్గొండ 59-28తో హైదరాబాద్‌పై నెగ్గింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి నల్గొండ 26-10తో ఆధిక్యం సాధించింది. అనంతరం తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ జట్టుకు మహబూబ్‌నగర్‌పై విజయం దక్కింది. 44-13తో ఆ జట్టును మట్టికరిపించింది. మొదటి అర్ధభాగంలో 30-7తో హైదరాబాద్ పైచేయి సాధించగా ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించింది. అలాగే ఆదిలాబాద్ జట్టుపై నల్గొండ 40-36తో గెలుపొందింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 23-13తో నల్గొండ జట్టు ముందంజ వేసింది. రెండో అర్ధభాగ ంలో ఆదిలాబాద్ జట్టు ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆఖరి నిమిషంలో నల్గొండ జట్టు ఆటగాళ్లు చాకచక్యంగా వ్యవహరించడంతో గట్టెక్కింది.