సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ‘ఎ’ లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్టు విజయం సాధించింది. సరూర్‌నగర్ శాట్స్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ మధ్య రైల్వే 66–23తో శాట్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి వెనుకబడిన శాట్స్ జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఎస్‌సీఆర్ 46–7తో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో అర్ధభాగంలో శాట్స్ జట్టు కాస్త ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది.
విజేత జట్టులో మల్లికార్జున, ఎస్‌కే అమీర్... శాట్స్ తరఫున బాలాజీ, రాఘవేంద్ర వరుసగా ‘బెస్ట్ రైడర్’, ‘బెస్ట్ డిఫెండర్’ అవార్డులను అందుకున్నారు. ఆంధ్రా బ్యాంక్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో రైడింగ్‌లో గణేశ్, నిఖిల్, రాజు... డిఫెండింగ్‌లో గౌరీ శంకర్ చెలరేగడంతో తెలంగాణ పోస్టల్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తెలంగాణ పోస్టల్ 56–20తో ఆంధ్రా బ్యాంక్‌ను ఓడించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పోస్టల్ 24–10 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. అనంతరం అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను దక్కించుకుంది. మరో మ్యాచ్‌లో టీఎస్ పోలీస్ 22–14తో ఎస్‌బీఐపై గెలిచింది. రైడింగ్‌లో రాజలింగం, అన్వేశ్ చెలరేగి జట్టుకు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిపెట్టారు. ఎస్‌బీఐ జట్టులో నర్సింగ్ రావు రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment