రాజస్థాన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యూత్‌గేమ్స్‌లో మెడల్‌సాధించిన శ్రీకాంత్
అసలే నిరుపేద కుటుంబం. ఆపై పెద్ద దిక్కు కోల్పోవడం, అన్ని తానై తండ్రిలేని లోటును కనిపించకుండా తన కుమారుడిని ఉన్నతుడిని చేయాలనే సంకల్పంతో కూలి పనులు చేస్తూ చదివిస్తోంది ఓ తల్లి.. అదే ఉన్నత ఆశయంతో, తల్లి సంకల్పాన్ని సాకారం చేసేందుకు చదువుతోపాటు కబడ్డీలో రాణిస్తూ జాతీయ స్థాయిలోనూ అవార్డులు సాధిస్తున్నారు కొందుర్గుకు చెందిన విద్యార్థి శ్రీకాంత్. అయితే ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జరిగే పోటీలలో పాల్గొనేందుకు దాతల సహకారాన్ని అర్థిస్తున్నాడు.
రంగారెడ్డి :కొందుర్గు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కృష్ణయ్య దంపతులకు పావని, శ్రీకాంత్ అను ఇద్దరు సంతానం. పావని పెళ్లైంది. అయితే రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణయ్య మృతిచెందాడు. ఇక ఈ కుటుంబంలో మిగిలింది తల్లి పార్వతమ్మ, కూమారుడు శ్రీకాంత్. తన కూమారుడిని ఎలాగైనా మంచి చదువులు చదివించి ఉన్నతమైన భవిష్యత్ అందించాలన్నదే పార్వతమ్మ కోరిక. తల్లి ఆశయాన్ని నెరవేర్చేందుకు శ్రీకాంత్ చదువులోనూ, అటు క్రీడలోనూ రాణిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కొందుర్గు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి సైతం శ్రీకాంత్‌ను క్రీడలో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఉన్నత పాఠశాలలో పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు సూచనలు, సలహాలు పాటిస్తూ ఎన్నో జాతీయ పతకాలు సాధించారు.
శ్రీకాంత్ సాధించిన విజయాలు
ప్రస్తుతం కొందుర్గు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీకాంత్ 2017 డిసెంబర్‌లో నిర్వహించిన కబడ్డీ అండర్–17 విభాగంలో చెన్నైలో జరిగిన జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని ప్రథమ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా 2018 నవంబర్‌లో రాజస్థాన్‌లో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లోనూ ఢిల్లీ జట్టుతో పోటీపడి ప్రథమ స్థానం పొందారు. ఇక 2019 సెప్టెంబర్‌లో పాండిచ్చేరి జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల కోసం ఎన్నికయ్యారు.
దాతల సహకారంతోనే ..
కాగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు శ్రీకాంత్‌కు ఆర్థిక పరిస్థితులు అంతగా లేకపోవడం వల్ల దాతల సహకారంతోనే అన్ని పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 22న మధ్యప్రదేశ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక వనరుల కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం
జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. చిన్నతనంలో లక్ష్మీదేవి టీచర్, పెద్దయ్యాక పీఈటీలు అనితారాణి, రామచంద్రుడు ఇద్దరు టీచర్లు సూచించిన సలహాలు నాకు స్ఫూర్తిని నింపాయి. ఇక నాయకుల ఆర్థిక సహాయంతోపాటు మా పాఠశాల ఉపాధ్యాయులు రూ. 500 చొప్పున అందించి నన్ను జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పంపించడం నాలో మరింత పట్టుదలను నింపింది.– కబడ్డీలో రాణిస్తున్న శ్రీకాంత్
నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలి
నా కొడుకు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే నా కోరిక. కుటుంబాన్ని పోషించే నా భర్త మృతిచెందాడు. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఉన్నతమైన భవిష్యత్ అందించాలని ఉంది. నా కొడుకు జాతీయ కబడ్డీ పోటీల్లో బహుమతి అందుకున్నాడని తెలియగానే చెప్పరాని సంతోషం వచ్చింది. మరిన్ని ఉత్తమ బహుమతులు అందుకొని మంచి భవిష్యత్ పొందాలని నా కోరిక. ఇందుకు దాతలు సహకరించాలి. – పార్వతమ్మ, శ్రీకాంత్ తల్లి
Comments
Please login to add a commentAdd a comment