
జాక్‌పాట్ కొడతాడా!
♦ మళ్లీ యువరాజ్‌పైనే అందరి దృష్టి
♦ శనివారం ఐపీఎల్-9 వేలం
♦ అందుబాటులో 351 మంది క్రికెటర్లు
రెండేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో రూ. 14 కోట్ల రికార్డు ధర, అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం. అయితే బెంగళూరుతో ఈ సంబరం ఒక్క ఏడాదికే సరి. వరల్డ్ కప్ ఫైనల్ వైఫల్య భారాన్ని మోస్తూ రావడంతో 2015 వేలంలో అతని విలువపై వేల సందేహాలు ఉన్నా...అది మరో రూ. 2 కోట్లు పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈసారీ ఒక సీజన్‌తోనే ఢిల్లీ బంధం తెగిపోయింది. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు దక్కుతాయి...ఎవరు అతడిని ఎంచుకుంటారు...ఇలా ఐపీఎల్ వేలంలో మరోసారి స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం భారత టి20 జట్టు సభ్యుడిగా కూడా ఉన్న అతను గతంలోకంటే ఎక్కువ మొత్తం రాబట్టి జాక్‌పాట్ కొడతాడా? లేక గత రెండు జట్ల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీలు భారీ మొత్తం చెల్లించడంలో వెనుకడుగు వేస్తాయా? అనేది ఆసక్తికరం.
సాక్షి క్రీడా విభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6న (శనివారం) బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. చెన్నై, రాజస్థాన్ జట్టు రద్దు కావడంతో కొత్తగా పుణే, రాజ్‌కోట్ జట్లు బరిలో నిలిచాయి. ప్రస్తుతానికి ఐదుగురేసి ప్రధాన ఆటగాళ్లను మాత్రమే తీసుకున్న ఈ టీమ్‌లు తమ పూర్తి స్థాయి జట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. దాంతో గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ సారి లీగ్ వేలంకు ప్రాధాన్యత పెరిగింది. పైగా ఆరు జట్లు కలిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. దాంతో ఫ్రాంచైజీల వద్ద చెప్పుకోదగ్గ మొత్తమే మిగిలింది. వేలం మొత్తం ఒక్కరోజులోనే ముగుస్తుంది. ఢిల్లీనుంచి కేదార్‌జాదవ్‌ను బెంగళూరు తీసుకోవడం ఒక్కటే ఈ ఏడాది ట్రేడింగ్ విండోలో జరిగిన మార్పు.
యువీ హవా సాగుతుందా
దాదాపు రెండేళ్ల తర్వాత టి20ల్లో భారత జట్టు తరఫున ఆడిన యువరాజ్ సింగ్ తాజా ఫామ్ వేలంలో కీలకం కావచ్చు. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశం రాలేదు కానీ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. చివరి మ్యాచ్‌లో కాస్త నెమ్మదించినా కీలక సమయంలో ఫోర్, సిక్స్ బాది తన ‘హిట్టింగ్’లో ఇంకా పదును ఉందని చూపించాడు. దేశవాళీలో 2015-16 సీజన్‌లో వన్డేల్లో ఆరు మ్యాచ్‌లలో దాదాపు 70 సగటుతో 346 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన యువీ, ముస్తాక్ అలీ టి20లో మూడు ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ చేసినా మిగతా రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. 2 వికెట్లూ పడగొట్టాడు.
శుక్రవారం ప్రకటించే ప్రపంచకప్ టీమ్‌లోనూ అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. పైగా రెండు కొత్త ఫ్రాంచైజీలు స్టార్ వ్యాల్యూ కోసం యువీ ఉంటేదని మంచిదని భావిస్తాయి. 2014 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున 14 మ్యాచ్‌లలో 376 పరుగులే చేసిన యువీ...గత ఏడాది డేర్‌డెవిల్స్ సభ్యుడిగా 13 ఇన్నింగ్స్‌లలో 248 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో టీమ్ యజమానులు గతంలోలాగా గుడ్డిగా వెళ్లకపోవచ్చు.
ఇషాంత్ విలువెంత..?
ఇతర భారత ప్రధాన ఆటగాళ్లలో పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీతో పాటు భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆశిష్ నెహ్రా కూడా వేలంలో అందుబాటులోకి రానున్నారు. వీరి ప్రారంభ విలువ రూ. 2 కోట్లుగా ఉంది. సన్‌రైజర్స్ జట్టులో గత ఏడాది పేసర్లు బౌల్ట్, భువనేశ్వర్ ఎక్కువ భాగం లీగ్ బరిలోకి దిగడంతో ఇషాంత్‌కు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గొప్ప రికార్డు లేకపోయినా... భారత పేసర్లందరిలో సీనియర్ ఆటగాడు కావడంతో అతనికి మంచి మొత్తం దక్కవచ్చు. చెన్నై రద్దు కావడంతో నెహ్రా కూడా వేలం బరిలో నిలిచాడు.
పీటర్సన్ సిద్ధం
విదేశీ ఆటగాళ్లలో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆటగాడు కెవిన్ పీటర్సన్. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో దుమ్ము రేపుతున్న పీటర్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా మెరుపు ప్రదర్శనను ఇచ్చిన కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌కు కూడా మంచి విలువ పలికే అవకాశం ఉంది. ఇక 40 ఏళ్లు దాటినా ఇటీవల బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన మైక్ హస్సీతో పాటు పాటు భారత్‌తో చివరి టి20లో భారీ సెంచరీతో చెలరేగిన షేన్‌వాట్సన్ వేలంలో భారీ మొత్తాన్ని ఆశిస్తున్నాడు.
కుర్రాళ్లు రెడీ
గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న పలువురు వర్ధమాన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. భారీ విలువ దక్కకపోయినా...కనీస మొత్తానికే లీగ్‌లో అడుగుపెడితే చాలని వీరంతా ఆసక్తిగా ఉన్నారు. వీరిలో కొందరు గతంలో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వారు కాగా... మరికొందరు పూర్తిగా తొలి చాన్స్ కోసం సిద్ధమయ్యారు. సంజు శామ్సన్, కరుణ్ నాయర్, నాథూసింగ్, కరియప్ప, అవేశ్ ఖాన్, రిషభ్ పంత్, ఆదిత్య తారే, కేఎస్ భరత్, పవన్ నేగి, దీపక్ హుడా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
2016 వేలం విశేషాలు...
మొత్తం వేలంలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య: 351
భారత క్రికెటర్లు: 230
విదేశీయులు: 121
క్యాప్డ్: 130, అన్‌క్యాప్డ్: 219, అసోసియేట్ ఆటగాళ్లు: 2 (కెనడా/ఐర్లాండ్)
ఎంత మందిని వేలంలో తీసుకునే అవకాశముంది: 116. మొత్తంగా ఒక జట్టులో ఆటగాళ్లు 27కు మించరాదు. వీరిలో 9 మంది మాత్రమే విదేశీయులు ఉండాలి.
ఎవరి వద్ద ఎంత మొత్తం ఉంది?
ఢిల్లీ రూ. 37.15 కోట్లు
హైదరాబాద్ రూ. 30.15 కోట్లు
పుణే రూ. 27 కోట్లు
రాజ్‌కోట్ రూ. 27 కోట్లు
పంజాబ్ రూ. 23 కోట్లు
బెంగళూరు రూ. 21.62 కోట్లు
కోల్‌కతా రూ. 17.95 కోట్లు
ముంబై 14.40 కోట్లు
♦ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో ఉన్న ఆటగాళ్లు (12 మంది): యువరాజ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, నెహ్రా, దినేశ్ కార్తీక్, బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి, మైక్ హస్సీ, కేన్‌రిచర్డ్సన్.
♦ రూ. 1.50 కోట్ల జాబితా (8 మంది): డేల్ స్టెయిన్, కామెరాన్ వైట్, జయవర్ధనే, ప్యాటిన్సన్, మోహిత్ శర్మ, హాడిన్, బట్లర్, దిల్షాన్.